Vijender Gupta: ఢిల్లీ అసెంబ్లీ వద్ద కలకలం.. పూలబొకేలతో హడలగొట్టిన ఆగంతుకుడు

Delhi Assembly Security Lapse Man Throws Ink on Speakers Car
షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం ఓ విచిత్ర ఘటన కలకలం రేపింది. కారుతో వేగంగా దూసుకొచ్చిన ఓ ఆగంతకుడు భద్రతా వలయాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించి, గేటు వద్ద ఓ పూల బొకే పెట్టాడు. అనంతరం స్పీకర్ కార్యాలయం వద్ద మరో బొకే ఉంచి, ఆయన వాహనంపై సిరా చల్లి పరారయ్యాడు. ఈ అనూహ్య ఘటనతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

వివరాల్లోకి వెళితే, సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబరున్న టాటా సియెరా కారులో వచ్చిన వ్యక్తి, వీఐపీల కోసం ఉద్దేశించిన గేట్ నంబర్ 2 వద్ద బ్యారికేడ్‌ను బలంగా ఢీకొట్టి లోపలికి చొరబడ్డాడు. సీఆర్పీఎఫ్ సిబ్బంది కాపలా ఉన్నప్పటికీ కారు వేగానికి బ్యారికేడ్ పక్కకు తొలిగింది. కారును ఆపిన డ్రైవర్, గేటు వద్ద పూల బొకే ఉంచాడు. ఆపై స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయం వైపు వెళ్లి, ఆయన వాహనంపై సిరా చల్లి, అక్కడ మరో బొకే పెట్టి కారులో వేగంగా వెళ్లిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. గాలింపు చర్యలు చేపట్టి, కొన్ని గంటల్లోనే నిందితుడు సరబ్జీత్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఉత్తర ఢిల్లీలోని రూప్ నగర్‌లో కారును స్వాధీనం చేసుకున్నారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు బొకేలను తనిఖీ చేయగా, వాటిలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం భద్రతా వైఫల్యంపై తీవ్ర చర్చకు దారితీసింది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Vijender Gupta
Delhi Assembly
security breach
Sarabjeet Singh
flower bouquets
bomb threat
Delhi police
crime news
Uttar Pradesh
security lapse

More Telugu News