IPL Ticket Fraud: ఐపీఎల్ టికెట్ల మోసం: టెక్కీకి రూ.1.46 లక్షల టోకరా

IPL Ticket Fraud Techie Loses 146 Lakh in Bengaluru
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. బెంగళూరులో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మధ్య జరిగిన మ్యాచ్ టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి, ఓ టెక్కీ నుంచి ఏకంగా రూ.1.46 లక్షలు కాజేశాడో కేటుగాడు.

బెంగళూరులోని బి. నారాయణపురకు చెందిన 25 ఏళ్ల బాధితుడు ఈ మోసంపై మహదేవపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో సుమిత్ బిస్వాల్ అనే వ్యక్తి తనను చిన్నస్వామి స్టేడియం టికెట్ కౌంటర్‌లో సీనియర్ సూపర్‌వైజర్‌గా పరిచయం చేసుకున్నాడు. మొదట రెండు టికెట్లను రూ.3,700 చొప్పున ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఆ తర్వాత అసలు మోసం మొదలుపెట్టాడు. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్, అదనపు ఐడీ కార్డులు, ఫుడ్ కూపన్లు అంటూ రకరకాల సాకులు చెప్పి విడతలవారీగా డబ్బులు వసూలు చేశాడు. బాధితుడు తన బ్యాంకు ఖాతా లిమిట్ అయిపోవడంతో, తల్లి ఖాతా నుంచి కూడా డబ్బు బదిలీ చేశాడు. నమ్మకం కోసం ఫేక్ ఈ-మెయిల్ కన్ఫర్మేషన్ పంపి, స్టేడియం గేట్ నెం.10 వద్దకు వస్తే టికెట్లు అందుతాయని చెప్పాడు.

అయితే, ఎంతసేపటికీ టికెట్లు రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐపీఎల్ వంటి ఈవెంట్ల టికెట్లను అధికారిక వెబ్‌సైట్లు లేదా యాప్‌ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని, సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
Go Back to Shorts
IPL Ticket Fraud
Bengaluru
Royal Challengers Bangalore
Chennai Super Kings
Cyber Crime
Online Fraud
Techie Scam
Sumit Biswal
Chinnaswamy Stadium
Mahadevapura Police

More Telugu News