Revanth Reddy: రాజేంద్రనగర్‌లో తెలంగాణ కొత్త హైకోర్టు... శంకుస్థాపన చేసిన సీజేఐ

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-2 భవన నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఆదివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ అంకురార్పణ కార్యక్రమం తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు అని ముఖ్యమంత్రి అభివర్ణించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఒక కోర్టు సముదాయాన్ని నిర్మించడం అంటే కులమతాలకు అతీతంగా ప్రజల కోసం ఒక పవిత్ర స్థలాన్ని నిర్మించడమేనని అన్నారు. "ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు చివరి ఆశ, నమ్మకం న్యాయస్థానమే. అటువంటి న్యాయస్థానాన్ని నిర్మించే అవకాశం మా ప్రభుత్వానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

ఈ కొత్త హైకోర్టు భవనం ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగా నిలుస్తుందని, న్యాయం కోసం వచ్చే పేదలు, బలహీనులకు భరోసా ఇస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2027 డిసెంబర్ నాటికి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎస్.వి. భట్టి, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Revanth Reddy
Telangana High Court
Rajendranagar
CJI Suryakant
High Court Building
Telangana News
Justice Alok Aradhe
Justice SV Bhatti
Justice Ujjal Bhuyan
Telangana Government

More Telugu News