Green Asha: తీవ్ర ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ దాటిన మరో భారత నౌక 'గ్రీన్ ఆశా'

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలు నిరంతరాయంగా సాగుతున్నాయి. తాజాగా 'గ్రీన్ ఆశా' అనే భారత జెండాతో కూడిన ఎల్పీజీ నౌక ఈ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ ప్రాంతంలో సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఈ కీలక సముద్ర మార్గాన్ని దాటిన తొమ్మిదో భారత ట్యాంకర్ ఇదే కావడం గమనార్హం.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ ఈ జలసంధిపై పట్టు బిగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన ఈ మార్గంలో భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయి. అయినప్పటికీ, ఇంధన అవసరాల దృష్ట్యా భారత్ ఈ మార్గంపైనే ఆధారపడుతోంది.

గ్రీన్ ఆశా కంటే ముందు కూడా అనేక భారత నౌకలు ఈ ప్రాంతాన్ని విజయవంతంగా దాటాయి. బీడబ్ల్యూ టైర్,  బీడబ్ల్యూ ఎల్మ్ అనే రెండు ఎల్పీజీ నౌకలు సుమారు 94,000 టన్నుల కార్గోను రవాణా చేశాయి. మార్చి నెలలో ఎంటీ శివాలిక్, ఎంటీ నందా దేవి అనే ట్యాంకర్లు 92,700 టన్నుల ఎల్పీజీని గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టులకు చేర్చాయి.

వీటితో పాటు, ముడి చమురు, ఇతర ఇంధనాలను కూడా భారత నౌకలు రవాణా చేస్తున్నాయి. 'జగ్ లాడ్కి' అనే ఆయిల్ ట్యాంకర్ యూఏఈ నుంచి 80,000 టన్నుల ముడి చమురును ముంద్రా పోర్టుకు తీసుకురాగా, 'జగ్ ప్రకాశ్' నౌక ఒమన్ నుంచి ఆఫ్రికా మార్కెట్లకు గ్యాసోలిన్‌ను చేరవేసింది. దేశీయ ఇంధన భద్రత కోసం ఈ ప్రమాదకర మార్గంలో ప్రయాణం తప్పడం లేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Green Asha
Hormuz Strait
India
Indian Tanker
West Asia
Iran
LPG Tanker
Energy Security

More Telugu News