Donald Trump: ట్రంప్ అల్టిమేటంను కొట్టిపారేసిన ఇరాన్.. ఆయ‌న‌ బెదిరింపులు పనికిమాలిన చర్య అంటూ ఘాటు స్పందన

Iran On Trumps 48 Hour Ultimatum For Peace Deal
షార్ట్స్‌లో చూడండి
శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికతో ప‌శ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. 48 గంటల్లోగా ఒప్పందం జరగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ అల్టిమేటం జారీ చేయగా, ఇరాన్ దీన్ని తీవ్రంగా ఖండించింది. ట్రంప్ బెదిరింపులను 'నిస్సహాయ, తెలివి తక్కువ చర్య'గా అభివర్ణించింది.

ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్.. "శాంతి ఒప్పందం కుదుర్చుకుని, కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్‌కు నరకం చూపిస్తాం" అని హెచ్చరించారు. గతంలో మార్చి 26న ఇచ్చిన 10 రోజుల గడువు ఈ నెల‌ 6తో ముగియనుండగా, ట్రంప్ ఈ తాజా అల్టిమేటం జారీ చేశారు.

ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సైనిక ఉన్నతాధికారి జనరల్ అలీ అబ్దుల్లాహి ఘాటుగా స్పందించారు. ఇరాన్‌పై అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడికి పాల్పడితే తీవ్ర ప్రతిచర్య ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ప‌శ్చిమాసియాలోని అన్ని అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలపై 'వినాశకరమైన, నిరంతర' దాడులు చేస్తామని స్పష్టం చేశారు. దేశ ఆస్తులను, హక్కులను కాపాడుకోవడానికి ఒక్క క్షణం కూడా వెనుకాడబోమన్నారు.

మరోవైపు ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్‌-15, ఏ-10 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించగా, ఒక పైలట్‌ను రక్షించామని, మరొకరి కోసం గాలిస్తున్నామని యూఎస్ వెల్లడించింది. దీనికి ముందు ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ కుటుంబ సభ్యులిద్దరిని అరెస్టు చేసినట్లు అమెరికా ప్రకటించింది.

ఇదే సమయంలో ఇరాన్‌లోని బుషెర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత 198 మంది సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అణుకేంద్రంపై దాడులు కొనసాగితే రేడియోధార్మికత వెలువడి గల్ఫ్ దేశాల రాజధానుల్లో జీవనం అంతమవుతుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించారు.
Go Back to Shorts
Donald Trump
Iran
US Iran tensions
Iran nuclear deal
Middle East conflict
Persian Gulf
Houthis
nuclear program
Israel
military action

More Telugu News