Missing Pilot: ట్రంప్ తోనే మీకు ప్రమాదం... మిస్సింగ్ పైలట్ తల్లికి ఇరాన్ సందేశం

Iran to Missing Pilots Mother Your Son Safer With Us Than Trump
షార్ట్స్‌లో చూడండి
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ జ్వాలలు ఇప్పట్లో చల్లారేట్టు లేవు. శుక్రవారం నాడు తమ దళాలు రెండు అమెరికన్ సైనిక విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ ఘటనలో ఒక పైలట్‌ను రక్షించగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో, తన కొడుకు (పైలట్) ఆచూకీ తెలియడం లేదంటూ ఓ అమెరికన్ మహిళ సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన ఆవేదనకు ఇరాన్ రాయబార కార్యాలయాలు ఊహించని రీతిలో సమాధానం ఇచ్చాయి.

"ఈ రాత్రి కూల్చివేయబడిన రెండు ఎఫ్-15 విమానాల పైలట్ల కోసం ప్రార్థించండి. నా కొడుకుల్లో ఒకడు ఫైటర్ పైలట్. అతని నుంచి లేదా అతని యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. నా గుండె ఆందోళనతో నిండిపోయింది," అంటూ ఆ తల్లి 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

ఈ పోస్టుపై పాకిస్థాన్‌లోని ఇరాన్ ఎంబసీ తీవ్రంగా స్పందించింది. "మీ కొడుకులు డొనాల్డ్ ట్రంప్ వద్ద కంటే ఇరాన్ కస్టడీలో ఎక్కువ సురక్షితంగా ఉంటారని నమ్మండి. అతను అమెరికన్ రెస్క్యూ టీముల చేతిలో పడకుండా, ఇరాన్ చేత బంధించబడి ఉండాలని ప్రార్థించండి. ముస్లింలుగా, నాగరిక ఇరానియన్లుగా బందీలను గౌరవంగా ఎలా చూసుకోవాలో మాకు తెలుసు," అని పేర్కొంది. ఇదే తరహాలో దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా, "మేము బందీలతో జియోనిస్టుల్లా వ్యవహరించం. మాకు ఇరానియన్ నాగరికత ఉంది. అమెరికాలా రాతియుగంలో జీవించడం లేదు" అని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించినప్పటి నుంచి ఈ యుద్ధం కొనసాగుతోంది. అప్పటి నుంచి మధ్యప్రాచ్యం అంతటా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 1,900 మందికి పైగా మరణించారు. గల్లంతైన పైలట్ కోసం అమెరికా డ్రోన్లు, విమానాలతో ముమ్మరంగా గాలిస్తోంది. మరోవైపు, ఆ పైలట్ పారాషూట్‌తో దిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని, అతన్ని సజీవంగా అప్పగిస్తే బహుమతి ఇస్తామని ఇరాన్ మీడియా ప్రకటించడం గమనార్హం. ఓ సైనిక ఘటనకు మానవత్వపు కోణాన్ని జోడిస్తూనే, తమ ప్రచారాన్ని ఇరాన్ బలంగా వినిపించడం ఈ ఘటనలో కీలకాంశంగా మారింది.
Go Back to Shorts
Missing Pilot
Iran
US Military
Donald Trump
Iran Embassy
American Pilot
Military Conflict
Middle East
F-15
Pilot Rescue

More Telugu News