Hormuz Strait: భారత నౌకలకు డోకా లేదు.. హ‌ర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన

ఇజ్రాయెల్, అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించిన ఇరాన్.. భారత్‌కు కీలక హామీ ఇచ్చింది. "భారత మిత్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. వారు సురక్షితంగా ఉన్నారు" అని భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం గురువారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ఈ భరోసాతో భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది.

ప్రపంచంలోని 20 శాతం ఇంధన రవాణా జరిగే హ‌ర్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉంది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికాతో వివాదం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ఈ మార్గంలో రాకపోకలను దాదాపు నిలిపివేసింది. అయితే భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్ వంటి స్నేహపూర్వక దేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఈ దిగ్బంధనం వల్ల భారత్ సహా పలు దేశాలకు ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇప్పటికే 8 భారత నౌకలు హ‌ర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. వీటిలో BW TYR, BW ELM అనే రెండు ఎల్‌పీజీ క్యారియర్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 94,000 టన్నుల ఎల్‌పీజీ భారత్‌కు చేరింది. అయితే, భారత్‌కు రావాల్సిన ఎల్‌పీజీ, ముడిచమురు, ఎల్‌ఎన్‌జీతో కూడిన మరో 19 నౌకలు ఇంకా అక్కడే చిక్కుకుపోయాయని అధికారులు తెలిపారు.

ఇటీవల జరిగిన మంత్రిత్వ శాఖల సమావేశంలో షిప్పింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌ కుమార్ సిన్హా ఈ వివరాలు వెల్లడించారు. చిక్కుకున్న నౌకల్లో భారత్‌కు చెందినవి 9 ఉండగా, విదేశీ జెండాలతో భారత్‌కు వస్తున్నవి 10 ఉన్నాయని ఆయన వివరించారు. ఈ సంక్షోభం కారణంగా మొత్తం 500 నౌకలు జలసంధిలో నిలిచిపోయినట్లు సమాచారం.
Hormuz Strait
Iran
India
Indian ships
Israel
US tensions
energy supply
Rajesh Kumar Sinha
BW TYR
BW ELM

More Telugu News