నటి ట్విషా శర్మ మృతి కేసులో సంచలనం.. పోస్టుమార్టంకు బెల్ట్ ఇవ్వని పోలీసులు!

Twisha Sharma Death Case Belt Not Given For Postmortem
  • ట్విషా శర్మ మృతి కేసులో దర్యాప్తుపై అనుమానాలు
  • కీలక ఆధారమైన బెల్ట్ సమర్పించని వైనం
  • భర్త సమర్థ్‌సింగ్‌కు బెయిల్ నిరాకరణ
  • వేధింపులపై ట్విషా వాట్సాప్ చాట్స్ వెలుగులోకి  
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోడల్, నటి ట్విషా శర్మ (33) మృతి కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ఉపయోగించారని భావిస్తున్న బెల్ట్‌ను పోస్టుమార్టం సమయంలో పోలీసులు ఫోరెన్సిక్ వైద్యులకు అందించలేదని భోపాల్ ఎయిమ్స్ నివేదిక స్పష్టం చేసింది. ఈ కీలకమైన వైఫల్యం వల్ల ట్విషా మెడపై ఉన్న గాయాలకు, ఉరి వేసుకున్న వస్తువుకు మధ్య సంబంధాన్ని నిర్ధారించడం సాధ్యం కాలేదు. దీంతో సాక్ష్యాల తారుమారు, దర్యాప్తు తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2024లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన సమర్థ్ సింగ్‌ను 2025 డిసెంబరులో ట్విషా శర్మ వివాహం చేసుకున్నారు. మే 12వ తేదీన భోపాల్‌లోని కటారా హిల్స్‌లో ఉన్న అత్తగారి ఇంట్లో ఆమె ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. అదనపు కట్నం కోసం తన భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించారని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రిటైర్డ్ జడ్జి అయిన అత్త గిరిబాల సింగ్ తన పలుకుబడిని ఉపయోగించి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్, ఏసీపీ రజనీష్ కశ్యప్ ఈ విషయంపై ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. సంఘటనా స్థలం నుంచి బెల్ట్‌ను స్వాధీనం చేసుకున్నామని, అయితే దానిని పోస్టుమార్టంకు అందించడంలో దర్యాప్తు అధికారి వైఫల్యం చెందారని అంగీకరించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్‌కు, అటు నుంచి ఎయిమ్స్‌కు బెల్ట్‌ను పంపామని ఆయన వివరించారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ట్విషా మృతదేహాన్ని ఆసుపత్రికి ఎందుకు తరలించారనే అంశంపైనా దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ కశ్యప్ తెలిపారు. "వారి నివాసంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. వాటి ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నాం. ఆసుపత్రికి తరలించిన పరిస్థితులపై కూడా విచారణ జరుపుతున్నాం" అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, ట్విషా ఒక మానసిక రోగి అని, డ్రగ్స్ బానిస అని ఆమె అత్త, రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. వాటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మరోపక్క, కట్నం ఆరోపణలను గిరిబాల తిప్పికొడుతూ, తాము ట్విషా అవసరాల కోసం అప్పుడప్పుడు  రూ.5,000 నుంచి రూ.50,000 వరకు పలుమార్లు ఆన్‌లైన్‌లో డబ్బు పంపామని గిరిబాల కోర్టుకు తెలుపుతూ, ఆ లావాదేవీల వివరాలను సమర్పించారు.

ఈ కేసులో గిరిబాలకు సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్‌కు మాత్రం బెయిల్‌ను నిరాకరించింది. పరారీలో ఉన్న సమర్థ్ సింగ్ ఆచూకీ తెలిపిన వారికి భోపాల్ పోలీసులు రూ.10,000 నగదు రివార్డు ప్రకటించారు. నిందితులిద్దరికీ శిక్ష పడినప్పుడే తమకు నిజమైన న్యాయం జరుగుతుందని ట్విషా తండ్రి నవనిధి శర్మ పీటీఐతో అన్నారు.

ఇదిలా ఉండగా, ట్విషా తన తల్లికి, స్నేహితురాలికి పంపిన వాట్సాప్ చాట్స్ సోమవారం వెలుగులోకి వచ్చాయి. పెళ్లి తర్వాత తాను పడుతున్న నరకాన్ని, మానసిక వేదనను ఆమె వాటిలో వివరించారు. తనను భోపాల్ నుంచి ఇంటికి తీసుకువెళ్లమని తల్లిని వేడుకున్నారు. పెళ్లి అనే బంధంలో చిక్కుకోవద్దని స్నేహితురాలికి సలహా ఇచ్చారు. ఈ చాట్స్‌లో గర్భం, అబార్షన్ గురించి కూడా ప్రస్తావన ఉంది. పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరని సమర్థ్ ప్రశ్నించి వేధించినట్లు కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోవడానికి ముందు రోజు రాత్రి 10 గంటల వరకు ట్విషా తమతో టచ్‌లో ఉందని వారు తెలిపారు. పెళ్లి తర్వాత మానసిక వేదనతో ఆమె 15 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Go Back to Shorts
Twisha Sharma
Twisha Sharma death case
model Twisha Sharma
Samarth Singh
dowry harassment
Bhopal police
postmortem report
Giribala Singh
suicide investigation
Katara Hills

More Telugu News