ట్రంప్, నెతన్యాహులను చంపితే రూ.559 కోట్ల బహుమతి.. ఇరాన్ పార్లమెంట్‌లో సంచలన బిల్లు!
- సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం
- అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్‌నూ టార్గెట్ చేసిన ఇరాన్
- కాల్పుల విరమణ ఒప్పందానికి విఘాతం కలిగే అవకాశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హత్య చేసిన వారికి 58 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.559 కోట్లు) భారీ బహుమతిని ప్రకటించేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అక్కడి పార్లమెంట్‌లో ఒక వివాదాస్పద బిల్లుపై త్వరలోనే ఓటింగ్ జరగనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ ఇబ్రహీం అజీజీ ఈ బిల్లుకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఖమేనీ మరణానికి కారణమైన ట్రంప్, నెతన్యాహులతో పాటు అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌లను కూడా టార్గెట్ చేయాలని ఇరాన్ పార్లమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా వీరిని చంపితే ఈ భారీ మొత్తాన్ని బహుమతిగా ఇస్తామని బిల్లులో పొందుపరిచారని తెలుస్తోంది.
ఇప్పటికే ఇరాన్‌కు చెందిన కొన్ని సంస్థలు, ‘హండాలా’ అనే సైబర్ హ్యాకింగ్ గ్రూపులు కూడా ట్రంప్, నెతన్యాహులపై విడివిడిగా 50 మిలియన్ డాలర్ల రివార్డులను ప్రకటించాయి. ఇప్పుడు ఏకంగా ఇరాన్ పార్లమెంటే చట్టబద్ధంగా ఈ నగదు బహుమతి బిల్లును తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఇరుపక్షాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి ఈ పరిణామం విఘాతం కల్పించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.