విజయ్ సంచలనం.. మాజీ ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌కు నివాళి
- ‘ముల్లివైకల్’ జ్ఞాపకాలను మోస్తూ ఉంటామని పోస్ట్
- శ్రీలంక తమిళుల కోసం నిలబడతామని భరోసా
- ప్రభాకరన్ వర్ధంతి సందర్భంగా ‘ఎక్స్’లో నివాళి
- సాధారణంగా ఎల్‌టీటీఈకి బహిరంగ మద్దతుకు అధికార పార్టీలు దూరం
- గతంలోనూ ప్రభాకరన్‌కు మద్దతుగా మాట్లాడిన విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు విజయ్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
శ్రీలంక సైన్యం చేతిలో ప్రభాకరన్ మరణించిన ‘ముల్లివైకల్’ ఘటనను విజయ్ గుర్తుచేసుకున్నారు. ‘ముల్లివైకల్ చేదు జ్ఞాపకాలను మేం ఎప్పటికీ గుండెల్లో మోస్తూనే ఉంటాం’ అని పేర్కొన్నారు. శ్రీలంకలో తమిళ హక్కుల కోసం ఎప్పుడూ అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.
1991లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్ ప్రధాన నిందితుడు. ఈ కారణంగానే భారతదేశంలో ఎల్‌టీటీఈ సంస్థపై నిషేధం కొనసాగుతోంది. శ్రీలంకలో తమిళుల కోసం ప్రభాకరన్ దాదాపు 30 ఏళ్ల పాటు అంతర్యుద్ధం నడిపారు. 2009 మే నెలలో జరిగిన సైనిక దాడితో ఆ యుద్ధం ‘ముల్లివైకల్’ అనే ప్రాంతంలో ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు మే 18వ తేదీని ‘ముల్లివైకల్ స్మారక దినం’గా పాటిస్తారు.
సాధారణంగా తమిళనాడులోని అధికార పార్టీలు ప్రభాకరన్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వవు. కానీ విజయ్ గతంలో కూడా ప్రభాకరన్‌ను ‘తల్లిలాంటి ప్రేమను పంచిన నాయకుడు’ అని కొనియాడారు. ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వానికి ఎల్‌టీటీఈ అనుకూల వీసీకే పార్టీ మద్దతు ఇస్తోంది.