Kavitha: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు టచ్‌లో ఉన్నారు: కవిత

Kavitha Says BRS MLAs Ex Leaders in Touch
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు తమతో టచ్‌లో ఉన్నారని, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు ప్రకటిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, అసెంబ్లీలో సమయం అంతా అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం తిట్లు, విమర్శలు చేసుకోవడానికే సరిపోయిందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను శ్రీరాముడిని, కేసీఆర్ రావణుడు అని చెబుతున్నారని, కానీ శకుని ఎవరో చెప్పాలని ఎద్దేవా చేశారు. తాను బర్బరీకుడిని అని ముఖ్యమంత్రి చెప్పుకుంటుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మావోయిస్టులు కూడా తమ పార్టీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారిది, తమది ఒకే అజెండా అని తెలిపారు. పార్టీ ఆవిర్భావానికి ముందు ఉమాభారతి సహా ఇతర పెద్దలను కలిసి ఆశీర్వాదం తీసుకుంటానని కవిత తెలిపారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కోసం పోరాటం చేస్తామని తెలిపారు.

యువతకు ఉద్యోగాలు దక్కకుండా జీవోల పేరుతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 40 లక్షల కుటుంబాలలోని విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా, ప్రభుత్వం మాత్రం వారికి న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారో చెప్పాలని నిలదీశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం పెట్టుకుందని ఆరోపించారు. 15 లక్షల రేషన్ కార్డులు తీసివేయాలని చూస్తోందని మండిపడ్డారు.
Go Back to Shorts
Kavitha
BRS MLAs
Telangana Jagruthi
Revanth Reddy
KCR
Telangana Politics
Ration Cards
Job Calendar

More Telugu News