Harish Rao: రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 'పహిల్వాన్' భాష మాట్లాడుతున్నారు: హరీశ్ రావు ఆగ్రహం

Harish Rao Criticizes Revanth Reddys Language in Assembly
షార్ట్స్‌లో చూడండి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలసీలను గాలికి వదిలేసి, పహిల్వాన్ల భాషను మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో పాలసీలు ఉంటాయి కానీ పహిల్వాలు, కుస్తీ పోటీలు ఉండవని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని కుస్తీల పోటీగా మార్చారని మండిపడ్డారు. కత్తులతో కోలాటంలో తలలు తీసేస్తామని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని కోరారు.

గడిచిన రెండున్నర సంవత్సరాలలో రేవంత్ రెడ్డి సభలో మాట్లాడిన ఎన్నో అనాగరిక వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం వైఫల్యాలను నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. అసెంబ్లీని కూడా ఈ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీ బ్రేక్ పేరుతో, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారని, ముఖ్యమంత్రి కేరళ నుంచి వస్తున్నారని, ఆర్థిక మంత్రి ప్రిపేర్ అవుతున్నారని, లంచ్ బ్రేక్ అంటూ ఇలా వివిధ కారణాలతో సభను గంటల పాటు వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వివిధ కారణాలతో అసెంబ్లీ సమయాన్ని వృధా చేశారని మండిపడ్డారు. కావాలని సభను రాత్రి వరకు నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేరళ ఎన్నికల కోసం శాసనసభను 30వ తేదీనే నిరవధిక వాయిదా వేశారని ఆరోపించారు. కేరళ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అవసరమేమో కానీ తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ శాసనసభ్యులకు ప్రజా సమస్యలు ముఖ్యమని అన్నారు.

రేవంత్ రెడ్డి, సీఆర్ పాటిల్ వ్యాఖ్యలకు తేడా లేదు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలకు పెద్దగా తేడా లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు కూడా కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్టు అని ప్రశంసించాయని అన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లాంటి వారు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణాకు వరప్రదాయిని అని అన్నారని గుర్తు చేశారు.

ఇటీవల పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎకనామిక్ సర్వేలో కాళేశ్వరం వల్ల సాగు భూమి విస్తీర్ణత పెరిగిందని చెప్పిందని వెల్లడించారు. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం వల్ల గత రెండేళ్లలో వేల ఎకరాల సాగు భూమి విస్తీర్ణత పెరిగిందని నివేదిక పెట్టారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల ప్రాజెక్టుకు, ముసీలో తెచ్చే గోదావరి నీళ్లు కాళేశ్వరం నుండి వస్తున్నాయని తెలిపారు.

సీఆర్ పాటిల్ తెలంగాణకు వచ్చి ఇక్కడ రైతులను నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగితే సమాధానం వస్తుందని అన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద బురదజల్లడానికే కాళేశ్వరం గురించి తప్పుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రూ.50 కోట్లు ఖర్చు చేస్తే మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుందని రెండేళ్ల నుంచి దాదాపు 20 లేఖలు రాస్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం లేదని ఆరోపించారు. మా మీద కోపం ఉంటే తీర్చుకోవచ్చు... కానీ ఆ కోపాన్ని రైతుల మీద చూపించవద్దని కోరారు.
Go Back to Shorts
Harish Rao
Revanth Reddy
Telangana Assembly
BRS Party
Kaleshwaram Project
CR Patil
Telangana Politics

More Telugu News