Rahul Gandhi: కేరళలో లెఫ్ట్ కూటమి గెలుపొందాలని మోదీ కోరుకుంటున్నారు: రాహుల్ గాంధీ

కేరళలో లెఫ్ట్ కూటమి గెలుపొందాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సీపీఐ(ఎం) వామపక్ష పార్టీ కాదని, అతివాద రైట్ వింగ్ పార్టీ అని విమర్శించారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా లెఫ్ట్ పార్టీ నేతలు బీజేపీతో జతకట్టారని అన్నారు. అందుకే కేరళలో ఎల్డీఎఫ్ గెలుపొందాలని మోదీ కోరుకుంటున్నారని అన్నారు.

కన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, మోదీ ప్రతిచోట మతం, దేవుడి గురించి మాట్లాడుతారని, కానీ కేరళలో మాత్రం కనీసం శబరిమల బంగారం చోరీపై కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. బంగారు తాపడాలు మాయం కావడం వెనుక సీపీఐ నేతల హస్తం ఉందని ఆరోపించారు. సీపీఐతో జతకట్టడం వల్లే బీజేపీ నాయకులు శబరిమల అంశంపై మాట్లాడటం లేదని అన్నారు.

బీజేపీతో జతకట్టడం సీపీఐలోని కొంతమంది నాయకులకు ఇష్టం లేదని, అందుకే వారు యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. శబరిమల ఆలయంలో బంగారం చోరీకి సంబంధించి సీపీఐ(ఎం) నాయకులపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ, ఇక్కడి ఎల్డీఎఫ్ మధ్య ఒక అవగాహన ఉందని ఆరోపించారు. కేరళ ముఖ్యమంత్రిని నరేంద్రమోదీ నియంత్రిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేరళ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టగలిగే తాళం చెవి మోదీ వద్ద ఉందని, కానీ ఆయన చర్యలు మాత్రం తీసుకోరని అన్నారు.
Rahul Gandhi
Kerala
LDF
Narendra Modi
CPI(M)
UDF
Sabarimala
Kerala Elections
BJP
Gold Smuggling

More Telugu News