Hormuz Strait: పశ్చిమాసియా యుద్ధం: హర్మూజ్ వద్ద చిక్కుకున్న 28 భారత ఇంధన నౌకలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి వద్ద రవాణా నిలిచిపోవడంతో భారత్‌కు ఇంధనాన్ని తీసుకొస్తున్న 28 నౌకలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా వెల్లడించారు. భారత నౌకలను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.

చిక్కుకుపోయిన వాటిలో భారత్‌కు చెందిన 18 నౌకలతో పాటు, విదేశీ జెండాలతో ప్రయాణిస్తున్న మరో 10 నౌకలు ఉన్నాయి. వీటిలో ముడి చమురు, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నౌకల్లో మొత్తం 485 మంది సిబ్బంది ఉన్నారని, వారంతా క్షేమంగా ఉన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత 72 గంటలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పేర్కొంది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తోంది. ఫలితంగా, గత రెండు రోజుల్లో 'BW TYR', 'BW ELM' అనే రెండు ఎల్పీజీ నౌకలు సుమారు 94,000 టన్నుల గ్యాస్‌తో జలసంధిని దాటాయి. అవి మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో ముంబై, మంగళూరు పోర్టులకు చేరుకోనున్నాయి. గత వారాల్లోనూ కొన్ని నౌకలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాయి.

భారత ఇంధన భద్రతకు హర్మూజ్ జలసంధి అత్యంత కీలకం. దేశానికి అవసరమైన ముడి చమురులో 40%, ఎల్‌ఎన్‌జీలో 50%, ఎల్పీజీ దిగుమతుల్లో ఏకంగా 90% ఈ మార్గం గుండానే వస్తాయి. ఈ నేపథ్యంలో, ఇరాన్ అధికారులతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. "శత్రు దేశాలకు చెందని నౌకలు" తమ అనుమతితో ప్రయాణించవచ్చని ఇరాన్ ప్రకటించడం కొంత సానుకూల పరిణామం.
Hormuz Strait
India energy vessels
West Asia war
Persian Gulf
crude oil
LPG tankers
LNG tankers
Rajesh Kumar Sinha
Iran

More Telugu News