Merugu Nagarjuna: టిడ్కో ఇళ్లపై చంద్రబాబు క్రెడిట్ చోరీ: మేరుగు నాగార్జున
రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న గృహ ప్రవేశాల కార్యక్రమంపై వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు కేవలం రంగులు వేసి, తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు.
"చంద్రబాబు తన పాలనలో ప్రజలకు ఏమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. క్రెడిట్ చోరీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు" అని మేరుగు నాగార్జున ఎద్దేవా చేశారు. ఈరోజు పట్టాలు ఇస్తున్నామని చెబుతున్న ఇళ్లన్నీ గత ప్రభుత్వంలోనే లబ్ధిదారులకు కేటాయించినవని, ప్రజలే స్వయంగా ఆ ధృవపత్రాలను చూపిస్తున్నా ప్రభుత్వం బరితెగించి అబద్ధాలు ఆడుతోందని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 21 నెలల్లో 5.50 లక్షల ఇళ్లు నిర్మించామని చెప్పడం పచ్చి అబద్ధమని నాగార్జున అన్నారు. "2014-19 మధ్య కానీ, ప్రస్తుతం కానీ ఒక్క నిరుపేద కుటుంబానికైనా ఒక్క ఇల్లు కట్టించి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? పేదల కోసం కనీసం గజం భూమినైనా చంద్రబాబు కొనుగోలు చేశారా?" అని ఆయన నిలదీశారు. జగన్ హయాంలో శరవేగంగా జరిగిన నిర్మాణాలను తమ ఖాతాలో వేసుకోవడం చంద్రబాబు నైజమని విమర్శించారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన మెజారిటీ శాతం జగన్ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు గృహ ప్రవేశాల డ్రామా ఆడుతున్నారని నాగార్జున మండిపడ్డారు. ప్రజలు అన్ని వాస్తవాలను గమనిస్తున్నారని, తప్పుడు ప్రచారాలతో వారిని మోసం చేయలేరని హితవు పలికారు. రాజధాని నిర్మాణం పేరుతో కాలయాపన చేస్తూ, పేదల ఇళ్లపై విషం చిమ్మడం మానుకోవాలని అన్నారు.