Thomas Reddy: ఆర్టీసీని కనుమరుగు చేసే కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డిపై థామస్‌ రెడ్డి ధ్వజం

Thomas Reddy Slams CM Revanth Over RTC Privatization Allegations
షార్ట్స్‌లో చూడండి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)ను ప్రైవేటీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారని ఆర్టీసీ జేఏసీ వైస్‌ చైర్మన్‌ థామస్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీసీ డిపోల్లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను అనుమతించవద్దని, సంస్థ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ నిన్న రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు చేపట్టారు. కరీంనగర్ డిపో-2 ఎదుట జరిగిన 'అర్ధనగ్న ప్రదర్శన'లో పాల్గొన్న థామస్‌ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.


రాష్ట్ర బడ్జెట్‌లో అన్ని శాఖలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం, ఆర్టీసీని మాత్రం విస్మరించిందని థామస్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి రావాల్సిన రూ. 7,500 కోట్ల బకాయిలకు గాను కేవలం రూ. 4 వేల కోట్లే కేటాయించడం దారుణమన్నారు. సంస్థకు నిధులు రాబట్టడంలో విఫలమైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


కేంద్ర నిధులతో కొనుగోలు చేసిన ఎలక్ట్రా, జేబీఎం కంపెనీల ఈవీ బస్సులను ఆర్టీసీకి అప్పగించి, లాభాలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని థామస్‌ రెడ్డి విమర్శించారు. ఈవీ బస్సుల నిర్వహణను పూర్తిగా ఆర్టీసీ యాజమాన్యానికే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ స్థలాల్లో కేవలం ఆర్టీసీ బస్సులే ఉండాలని, ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు.


ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని, యూనియన్లకు గుర్తింపునిస్తామని రేవంత్‌రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని థామస్‌ రెడ్డి నిలదీశారు. అధికారంలోకి వచ్చాక కేంద్రం చెప్పినట్లు ప్రైవేటీకరణ నిర్ణయాలను అమలు చేయడానికి సీఎం మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ధ్వజమెత్తారు.

Go Back to Shorts
Thomas Reddy
TSRTC
Revanth Reddy
Telangana RTC Privatization
Ponnam Prabhakar
RTC Strike
Telangana Transport
Electric Buses
RTC Funds

More Telugu News