Vaibhav Suryavanshi: సూర్యవంశీ వీరబాదుడు... సీఎస్కేపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం

Vaibhav Suryavanshi Leads Rajasthan Royals to Victory Over CSK
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (52; 17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో, చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యవంశీ ఆడిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఛేజింగ్ లో రాజస్థాన్‌కు, చెన్నై బౌలర్లను ఎదుర్కోవడం పెద్ద కష్టంగా అనిపించలేదు. ముఖ్యంగా ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే బాదుడు మొదలుపెట్టాడు. క్రీజులోకి వచ్చిన కాసేపటికే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లోనే 305.88 స్ట్రైక్ రేట్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసి చెన్నై శిబిరాన్ని నిరాశకు గురిచేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 74 పరుగులకు చేరిందంటే వైభవ్ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తొలి వికెట్‌కు యశస్వి జైస్వాల్‌తో కలిసి కేవలం 38 బంతుల్లోనే 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. సూర్యవంశీ ఔటైన తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ (18; 9 బంతుల్లో) కూడా వేగంగా ఆడాడు. మరో ఎండ్‌లో యశస్వి జైస్వాల్ (38 నాటౌట్; 36 బంతుల్లో) నిలకడగా ఆడి, కెప్టెన్ రియాన్ పరాగ్ (14 నాటౌట్)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు.

అంతకుముందు, రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడకుండా 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. సంజూ శాంసన్ (6), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6) సహా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. ఒక దశలో 57 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో జేమీ ఓవర్టన్ (43; 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో చెన్నై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టి చెన్నై పతనాన్ని శాసించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ ఈ సీజన్‌లో తమ జైత్రయాత్రను ఘనంగా ప్రారంభించింది.
Go Back to Shorts
Vaibhav Suryavanshi
Rajasthan Royals
CSK
IPL 2026
Chennai Super Kings
RR vs CSK
Jofra Archer
Sanju Samson
Ruturaj Gaikwad
Yashasvi Jaiswal

More Telugu News