KTR: 'హేట్ స్పీచ్' బిల్లు ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకే: కేటీఆర్

KTR Slams Telangana Hate Speech Bill as Anti Democratic
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 'తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు'పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకు ప్రభుత్వం ప్రయోగిస్తున్న ఒక 'క్రూరమైన ఆయుధం' అని ఆయన అభివర్ణించారు. వాళ్లను విమర్శించే వారి నోళ్లు మూయించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఈ బిల్లు గనుక చట్టరూపం దాల్చితే, రాజ్యాంగం పౌరులకు కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలకే పెను ముప్పు వాటిల్లుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతే అయినా, దానికోసం తీసుకొస్తున్న ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత అస్పష్టంగా ఉన్నాయని కేటీఆర్ విమర్శించారు. "ఈ బిల్లు రూపకల్పనను పరిశీలిస్తే, అమలు యంత్రాంగం వాస్తవ ఆధారాల కంటే అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఉంది. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగానికి దారితీస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. 

బిల్లులో పొందుపరిచిన ‘వ్యతిరేక భావాలు ప్రేరేపించడం’, ‘సామాజిక సమగ్రతను దెబ్బతీయడం’ వంటి పదాలకు స్పష్టమైన న్యాయ నిర్వచనం, పరిమితులు లేవని ఆయన ఎత్తిచూపారు. ఈ పదజాలం ఉద్దేశపూర్వకంగానే అస్పష్టంగా ఉంచారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఇలా చేశారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను విమర్శిస్తే, వాటిని 'ఫేక్ న్యూస్'గా ముద్రవేసి జైలుకు పంపే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికే దేశంలో విద్వేష ప్రసంగాలను అరికట్టేందుకు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) వంటి చట్టాలు బలంగా ఉన్నాయని గుర్తుచేశారు. "ఇప్పటికే తగినన్ని చట్టాలు ఉండగా, అదనంగా ఈ కొత్త చట్టం తీసుకురావడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటి?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని, అణచివేత ధోరణిని విడనాడి ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
KTR
K Taraka Rama Rao
BRS Party
Telangana Hate Speech Bill
Hate Crime Bill
Telangana Government
Revanth Reddy
Freedom of Speech
Indian Penal Code
Criminal Procedure Code

More Telugu News