Chandrababu Naidu: ఇది మా మత్స్య సంపద... ఇతర రాష్ట్రాల జాలర్లు రావడం కరెక్ట్ కాదు: నాయుడుపేటలో సీఎం చంద్రబాబు

ఇతర రాష్ట్రాల జాలర్లు ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి ప్రవేశించి చేపల వేట సాగించడం ఏమాత్రం సరికాదని, ఇక్కడి మత్స్యకారుల జీవితాలను దెబ్బతీసే ఈ చర్యలను ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలకు ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. నేడు నాయుడుపేటలో ఇళ్ల పంపిణీ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం, పొరుగు రాష్ట్రాల జాలర్ల చొరబాట్లను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ విధానం వల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యగా నెల్లూరు తీర ప్రాంత పరిరక్షణ కోసం రెండు ప్రత్యేక గస్తీ బోట్లను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అవసరమైతే మరో నాలుగు గస్తీ బోట్లను కూడా పంపించి తీర ప్రాంత నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యతను నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. "మనకు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. మన మత్స్య సంపద మన మత్స్యకారులకే చెందాలి. తమిళనాడు, పుదుచ్చేరి నుంచి వచ్చి మన జలాల్లో చేపలు పట్టుకోవడానికి వీల్లేదు. వారిని ఇక్కడికి రానివ్వకుండా కట్టడి చేస్తాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

గతంలో తీర ప్రాంత నిఘా కోసం తాము 20 బోట్లను ఏర్పాటు చేస్తే, వైసీపీ ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసిందని, ఫలితంగా 12 బోట్లు నాశనమయ్యాయని ఆయన ఆరోపించారు. మత్స్యకారులకు అన్యాయం జరగకుండా చూడటం తన బాధ్యత అని పునరుద్ఘాటించారు.

ఇదే సభలో మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న మరిన్ని చర్యలను కూడా సీఎం వివరించారు. చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని "మత్స్యకార సేవ" పథకం ద్వారా రూ.20 వేలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1.29 లక్షల కుటుంబాలకు రూ. 259 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. మత్స్యకారులకు నష్టం కలిగించేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవోను కూడా రద్దు చేశామని గుర్తుచేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh fisheries
AP fishermen
fishermen welfare
Nellore coast
coastal security
fisheries dispute
Tamil Nadu fishermen
Puducherry fishermen
Matsyakara Seva

More Telugu News