Manda Krishna Madiga: ఎస్సీ హోదాను కాదు.. కుల వ్యవస్థనే రద్దు చేయండి: సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ మాదిగ

Manda Krishna Madiga calls for abolition of caste system after Supreme Court verdict
షార్ట్స్‌లో చూడండి

దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అసహనం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... న్యాయవ్యవస్థ, పార్లమెంట్, రాష్ట్రపతికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మత మార్పిడి ఆధారంగా హోదాలు తొలగించడం కాకుండా, దేశంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


1950లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని, అయితే ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధమని మంద కృష్ణ విమర్శించారు. అవి వివక్షతో కూడుకున్నవని, దళితుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. కుల వ్యవస్థ వల్ల అత్యంత దారుణంగా నష్టపోయింది దళితులేనని, పశువుల కంటే హీనంగా చూడబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన దళితులు ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని, అందుకే ఎస్సీ హోదా కొనసాగించాలని కోరారు.


దేశంలోని కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులేనని మంద కృష్ణ పేర్కొన్నారు. "ఈ వ్యవస్థలో ఏ రెండు కులాల మధ్య సామాజిక సామరస్యం లేదు. కానీ అన్ని కులాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ, గౌరవం పొందుతున్నది మాత్రం బ్రాహ్మణ వ్యవస్థే" అని ఆయన ఆరోపించారు. అసమానతలను కోరుకునే వారే కుల వ్యవస్థ ఉండాలని కోరుకుంటారని, సమానత్వాన్ని కాంక్షించే వారు కుల నిర్మూలన కోసం పోరాడతారని తెలిపారు.


కుల వ్యవస్థ రద్దుపై ఏ రాజకీయ పార్టీకి ఏ విధమైన అభిప్రాయం ఉందో బహిరంగంగా వెల్లడించాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు. అంటరానితనం ఏ వ్యవస్థ నుంచి పుట్టిందో పార్టీలు స్పష్టం చేయాలన్నారు. కుల వ్యవస్థను రద్దు చేసేందుకు ఏ పార్టీ లేదా సంస్థ ముందుకు వచ్చినా, ఎమ్మార్పీఎస్ తరఫున వారికి అండగా నిలబడతామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉందని, దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Go Back to Shorts
Manda Krishna Madiga
Supreme Court Verdict
Caste System
Dalit Rights
MRPS
Religious Conversion
Social Discrimination
Reservation
Caste Annihilation

More Telugu News