Anuroop Narula: అమ్మాయి పిలిచిందని వెళితే... నిలువు దోపిడీ చేశారు!

Delhi Man Robbed 7 Lakh After Meeting Dating App Woman
షార్ట్స్‌లో చూడండి
డేటింగ్ యాప్‌లో పరిచయమైన అమ్మాయితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి భయంకరమైన అనుభవం ఎదురైంది. అదను చూసి అతడిని కిడ్నాప్ చేసి, దాడి చేసి, ఏకంగా రూ.7 లక్షలు దోచుకున్నారు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఒక మహిళతో సహా ఐదుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బాధితులకు వల వేసి దోపిడీలకు పాల్పడుతున్న ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

వివరాల్లోకి వెళితే, అనురూప్ నరులా అనే యువకుడికి ‘3ఎఫ్’ అనే డేటింగ్ యాప్‌లో ‘షెర్రీ’ పేరుతో ఒక యువతి పరిచయమైంది. ఆమె బుధవారం అతడిని ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్‌కు డేట్‌కు ఆహ్వానించింది. అనురూప్ అక్కడికి వెళ్లగానే, ఆ యువతితో పాటు మాటువేసిన ముగ్గురు యువకులు ఒక్కసారిగా దాడి చేశారు. బలవంతంగా కారులోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. కారులోనే అనురూప్‌ను తీవ్రంగా కొట్టి, గొంతు నులిమి స్పృహ కోల్పోయేలా చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం అతడిని బెదిరించి యూపీఐ, ఏటీఎం, క్రెడిట్ కార్డుల ద్వారా సుమారు రూ.7 లక్షలను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. డబ్బు దోచుకున్న తర్వాత నిందితులు అతడిని మళ్లీ నెహ్రూ ప్లేస్‌లోనే వదిలేసి, పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని హెచ్చరించారు.

బాధితుడు అనురూప్ నరులా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రతన్ లాల్, ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎస్. దగర్ సారథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తును వేగవంతం చేసింది. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డులు, డిజిటల్ లావాదేవీల వివరాలు, సీడీఆర్, ఓఎస్ఐఎన్‌టీ, ఫాస్టాగ్ డేటాను క్షుణ్ణంగా విశ్లేషించి నిందితుల కదలికలను గుర్తించారు.

తొలుత చత్తర్‌పూర్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ రిషభ్ రాఘవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా వచ్చిన సమాచారంతో మిగతా నలుగురిని మాల్వియా నగర్‌లో అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో జిమ్ ట్రైనర్ నవోజిత్, సాహిల్, వెటర్నరీ అసిస్టెంట్ సంజయ్, డేటింగ్ యాప్‌లో ‘షెర్రీ’ పేరుతో యువకులను ఆకర్షించే హర్లీన్ కౌర్ అలియాస్ ‘జెన్నీ’ ఉన్నారు. 

హర్లీన్ కౌర్ డేటింగ్ యాప్‌ల ద్వారా సంపన్న యువకులను లక్ష్యంగా చేసుకుని, డేట్‌కు పిలుస్తుందని, ఆ సమాచారంతో మిగతా ముఠా సభ్యులు పథకం ప్రకారం దోపిడీలకు పాల్పడతారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన రెండు కార్లు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో డేటింగ్ యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
Go Back to Shorts
Anuroop Narula
Dating app
Delhi crime
Kidnapping
Cyber crime
Harleen Kaur
Online dating safety
Nehru Place
Ransom
3F dating app

More Telugu News