IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్ కు తెరలేచింది.. సన్‌రైజర్స్ పై టాస్ గెలిచిన ఆర్సీబీ

IPL 2026 RCB vs SRH Rajat Patidar chooses to bowl
షార్ట్స్‌లో చూడండి
కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌కు ఘనంగా తెరలేచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సొంతగడ్డపై హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

టాస్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ మాట్లాడుతూ.. "మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. గతేడాది నుంచి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, ఈ కొత్త సీజన్‌లో మేం డిఫెండింగ్ ఛాంపియన్‌గా కాకుండా, మరోసారి టైటిల్ గెలవడానికే ప్రయత్నిస్తాం. మా జెర్సీపై రెండో స్టార్‌ను చేర్చేందుకు మా శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. మా జట్టులో జాకబ్ డఫీ, అభినందన్ సింగ్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నారు" అని తెలిపాడు.

మరోవైపు సన్‌రైజర్స్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. "పిచ్ ఫ్రెష్‌గా కనిపిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా పెద్ద తేడా ఉండదు. మేం కొత్తగా ఏమీ ప్రయత్నించాల్సిన అవసరం లేదు, మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే చాలు. జట్టులోని ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు" అని ధీమా వ్యక్తం చేశాడు.

ఇరు జట్ల వివరాలు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.

గత సీజన్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా శుభారంభం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో తొలి మ్యాచ్‌లోనే అభిమానులకు హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
Go Back to Shorts
IPL 2026
RCB vs SRH
Royal Challengers Bangalore
Sunrisers Hyderabad
Rajat Patidar
Indian Premier League
Cricket
T20
Virat Kohli
Ishan Kishan

More Telugu News