Rammohan Naidu: ఉద్యోగాల కేంద్రంగా జేవార్ ఎయిర్‌పోర్ట్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Jewar Airport to boost economy says Rammohan Naidu
షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఉత్తరప్రదేశ్‌కే కాకుండా యావత్ దేశానికి ఉద్యోగ, పెట్టుబడుల, ఆర్థిక వృద్ధి కేంద్రంగా మారుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ సమక్షంలో ఆయన ప్రసంగించారు. జేవార్‌లో ఈ విమానాశ్రయం ప్రారంభం కావడం దేశానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త విమానాశ్రయంతో దేశ రాజధాని ప్రాంతానికి మరో గుండెచప్పుడు లాంటిదని ఆయన అభివర్ణించారు.

తొలి దశలో దాదాపు రూ.11,200 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసినట్టు తెలిపారు. అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించగల సామర్థ్యంతో నాలుగు కిలోమీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించినట్టు వివరించారు. ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా, అభివృద్ధికి వారసత్వాన్ని జోడిస్తూ ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక గుర్తింపును ఈ ఎయిర్‌పోర్ట్ టర్మినల్ ప్రతిబింబిస్తుందని చెప్పారు.

ఈ ప్రాజెక్టును కార్గో మౌలిక వసతులతో కూడిన సమీకృత 'ఏరోట్రోపోలిస్'‌గా తీర్చిదిద్దుతున్నామని, దీనివల్ల స్థానికంగా తయారైన వస్తువులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా చేరుకుంటాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. 40 ఎకరాల్లో ఏర్పాటు కానున్న మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ కేంద్రం స్థానిక యువతకు విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.

"గతంలో జేవార్, సమీప ప్రాంతాల ప్రజలు ఉద్యోగాల కోసం ఢిల్లీ వెళ్లేవారు. ఇప్పుడు దేశ విదేశాల నుంచి ప్రజలు ఉద్యోగాల కోసం జేవార్‌కు వస్తారు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్ వంటి అనేక రంగాల్లో అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 'ఉడాన్' వంటి పథకాలతో సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని, ఈ వృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
Go Back to Shorts
Rammohan Naidu
Jewar Airport
Narendra Modi
Noida International Airport
Uttar Pradesh
Aviation Sector Jobs
Indian Economy
UDAN Scheme
Airport Development
Cargo Infrastructure

More Telugu News