Iran: హర్మూజ్‌లో తీవ్ర ఉద్రిక్తత... చమురు ట్యాంకర్‌ను ధ్వంసం చేసిన ఇరాన్... వీడియో వైరల్!

Iran Destroys Oil Tanker in Hormuz Strait Amid Rising Tensions
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో అట్టుడుకుతున్న పర్షియన్ గల్ఫ్‌లో మరోసారి ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. హర్మూజ్ జలసంధిలో తమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించిన ఓ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

దాడికి గురైన ట్యాంకర్ పాకిస్థాన్ జెండాతో ఉన్నట్లు పలు కథనాలు సూచిస్తున్నాయి. ఇరాన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి జలసంధిని దాటేందుకు ప్రయత్నించడంతోనే ఈ దాడి చేసినట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి. మరోవైపు, పాకిస్థాన్ జెండా చాటున చమురును అక్రమంగా అమెరికాకు తరలిస్తున్నారని, దానికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ట్యాంకర్‌కు మంటలు అంటుకుని, పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో సిబ్బంది ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడులు చేసినప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకుంది. తమ అనుమతి లేకుండా ఏ నౌక ప్రవేశించరాదని ఆంక్షలు విధించింది. దీంతో ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం స్తంభించిపోగా, 85కి పైగా ట్యాంకర్లు గల్ఫ్‌లోనే చిక్కుకుపోయాయి. మార్చి 11న కూడా థాయ్‌లాండ్‌కు చెందిన నౌకపై దాడి జరిగింది.

ఈ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది. తాజా ఘటనతో ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింత దట్టమయ్యాయి. సంక్షోభం ముదరకుండా దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Go Back to Shorts
Iran
Hormuz Strait
Oil Tanker
Persian Gulf
America
Israel
IRGC
Crude Oil Prices
Pakistan
Middle East Conflict

More Telugu News