Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట.. సినిమాల్లో నటించొద్దన్న పిటిషన్ కొట్టివేత

Pawan Kalyan Gets Relief in High Court Petition Dismissed
షార్ట్స్‌లో చూడండి
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన సినిమాల్లో నటించకుండా నిలువరించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని కోర్టు స్పష్టం చేసింది.

డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం అనైతికమని పేర్కొంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. 'హరిహర వీరమల్లు' సినిమా ప్రమోషన్ కోసం పవన్ ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. టికెట్ ధరల పెంపు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఈ అంశాలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని తన పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మంత్రులుగా ఉన్నవారు సినిమాల్లో నటించకూడదని ఎలాంటి చట్టం లేదని కోర్టుకు తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విషయంలోనూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. టికెట్ ధరల పెంపు అనేది నిర్మాత అభ్యర్థన మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప, దీనితో డిప్యూటీ సీఎంకు సంబంధం లేదన్నారు. పవన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్ అని వాదించారు.

ఏజీ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, పిటిషన్‌కు విచారణ అర్హత లేదని చెబుతూ దానిని కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
AP Deputy CM
Hari Hara Veera Mallu
Andhra Pradesh High Court
Vijay Kumar IAS
Movie Ticket Prices
Political Petition
Dammalapati Srinivas
NTR

More Telugu News