Nayanthara: నయనతారపై వ్యాఖ్యలు... నడిగర సంఘంతో పాటు ఖుష్బూ కూడా ఫైర్

CV Shanmugams Nayanthara Comment Sparks Outrage
షార్ట్స్‌లో చూడండి
సినీ నటి నయనతారపై చేసిన వ్యాఖ్యలకు గాను అన్నాడీఎంకే నాయకుడు, రాజ్యసభ సభ్యుడు షణ్ముగం వెంటనే క్షమాపణలు చెప్పాలని నడిగర సంఘం డిమాండ్ చేసింది. సినీ నటిపై ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. సినిమా తారలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను ఎవరూ సమర్థించలేరని తెలిపింది. బాధ్యతాయుత పదవుల్లో ఉండి ఈ విధంగా మాట్లాడటమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది.

మహిళల భద్రత కోసం మంగళవారం విల్లుపురంలో ఎన్డీయే కూటమి నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ అందరి కలలను నెరవేరుస్తానని చెబుతున్నారని, నాకు నయనతార కావాలనే కోరికను నెరవేరుస్తారా, ఎవరైనా నయనతారను పెళ్లి చేసుకుంటానంటే వారి కలను సాకారం చేస్తారా? అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఖండించిన ఖుష్బూ

అన్నాడీఎంకే ఎంపీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నాయకురాలు ఖుష్బూ ఖండించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మహిళలు, నటీమణులేమీ వస్తువులు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి నచ్చినప్పుడు వారు తమ వివాదాల్లోకి మహిళలను లాగడానికి వారేమీ మీ ఆస్తి కాదని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఒక నటి పేరును తీసుకుని ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరికాదని అన్నారు. హాస్యం కోసం కూడా మహిళలను లాగవద్దని అన్నారు. ప్రపంచంలో ప్రతి మగాడు కూడా ఒక స్త్రీకి పుట్టాడనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు.

నటీమణులపై సులభంగా మాట్లాడుతున్న నాయకులు ఒక్కసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని అన్నారు. మీ తల్లి, సోదరి, భార్య, కుమార్తె లేదా మీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నటీమణులకు ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన వారు ప్రజల ఆస్తి కాదని గుర్తించాలని హితవు పలికారు. ఇతర అన్నివృత్తుల్లో మహిళలను గౌరవిస్తున్నట్లు సినీ పరిశ్రమలోని వారినీ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.

గౌరవం అనేది వృత్తిపై ఆధారపడి ఉండకూడదని సూచించారు. అలాంటి వ్యాఖ్యలు చేయడమంటే మహిళా నటీమణులను అవమానించడమే కాదని, అలా మాట్లాడిన వారు తమ వ్యక్తిత్వాన్ని, తమ పెంపకాన్ని, కనీస మర్యాద లేనితనాన్ని బయటపెట్టుకుంటున్నట్లే అని అన్నారు. ఇలాంటివి మానవత్వానికే అవమానకరమని వ్యాఖ్యానించారు. గౌరవం అనేది ఎప్పుడూ ఏకపక్షంగా ఉండకూడదని ఖుష్బూ అన్నారు.
Go Back to Shorts
Nayanthara
CV Shanmugam
Khushbu
Nadigar Sangam
Tamil Nadu Politics
actress comments controversy

More Telugu News