Danam Nagender: బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు: కేటీఆర్

Danam Nagender Contested as Congress MP After Winning as BRS MLA Says KTR
షార్ట్స్‌లో చూడండి
దానం నాగేందర్ తమ పార్టీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శాసనసభలో ఆయన పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ స్పీకర్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని అన్నారు. తీర్పు తప్పుగా ఉన్నప్పటికీ, తాము స్పీకర్‌ను గౌరవిస్తున్నామని అన్నారు. పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ పార్టీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, బాల్క సుమన్‌లపై దాడులు జరిగాయని, హరీశ్ రావు క్యాంపు కార్యాలయం, తన క్యాంపు కార్యాలయంపై కూడా దాడులు జరిగాయని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం 67 వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటోందని, కానీ ఇచ్చింది 11 వేల ఉద్యోగాలే అన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జాబ్ క్యాలెండర్ ఉత్తుత్తి క్యాలెండర్ అయిందని విమర్శించారు. ఏ గ్రామంలో అయినా సంపూర్ణ రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.

ముఖ్యమంత్రి హార్వర్డ్ లో చాలా నేర్చుకున్నారని, ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరించిందని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్స్ ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. గట్టిగా అడిగితే బెదిరింపులు తప్ప ఏమీ లేదని అన్నారు. ఉచిత బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ బస్సులను పెంచాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇటుక పెట్టలేదు కానీ కూల్చివేతలు మాత్రం జరుగుతున్నాయని అన్నారు. శారదా పీఠానికి ఇచ్చిన భూములు కూడా వదలడం లేదని అన్నారు.
Go Back to Shorts
Danam Nagender
BRS
Congress
KTR
Telangana Politics
Party Defection
Job Creation
Loan Waiver

More Telugu News