FASTag: వాహనదారులకు అలర్ట్.. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధర పెంపు

FASTag Annual Pass Price Increased by NHAI
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ రుసుమును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.3,000గా ఉన్న ఈ పాస్ ధరను రూ.75 పెంచి రూ.3,075గా నిర్ణయించింది. ఈ కొత్త ధరలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

నేషనల్ హైవేస్ ఫీ (నిబంధనలు, వసూళ్లు) రూల్స్, 2008 ప్రకారం ఏటా టోల్ చార్జీలను సవరిస్తుంటారు. ఇందులో భాగంగానే హోల్‌సేల్ ధరల సూచీ (WPI) వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పెంపును అమలు చేస్తున్నట్లు ఎన్‌హెచ్ఏఐ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 56 లక్షల మందికి పైగా ఈ యాన్యువల్ పాస్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.

ప్రయాణికులపై టోల్ భారాన్ని తగ్గించేందుకు 2025, ఆగస్టు 15న ఈ వార్షిక పాస్ విధానాన్ని ఎన్‌హెచ్ఏఐ ప్రవేశపెట్టింది. సొంత వినియోగానికి వాడే కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది. పాస్ తీసుకున్న తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 టోల్ ప్లాజాల వద్ద ప్రయాణం చేసే వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. గడువు ముగిశాక మళ్లీ రెన్యువల్ చేసుకోవచ్చు.

వినియోగదారులు 'రాజ్‌మార్గ్ యాత్ర' మొబైల్ యాప్ లేదా ఎన్‌హెచ్ఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ పాస్‌ను కొనుగోలు చేయవచ్చు. డబ్బులు చెల్లించిన రెండు గంటల్లోనే ప్రస్తుత ఫాస్టాగ్‌పై పాస్ యాక్టివేట్ అవుతుంది. ఈ పాస్ కేవలం జాతీయ రహదారులపై ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద మాత్రమే పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని టోల్ గేట్ల వద్ద ఇది వర్తించదు.
FASTag
NHAI
National Highways Authority of India
Annual Pass
Toll Tax
Rajmarg Yatra
Toll Plaza
Highway Tolls
WPI
Wholesale Price Index

More Telugu News