చిన్న నిర్మాతలతో ఏపీ, తెలంగాణ సీఎంలు చర్చలు జరపాలి: చదలవాడ శ్రీనివాసరావు

Chadalavada Srinivasa Rao Urges AP Telangana CMs to Discuss with Small Producers
  • పరిశ్రమలో చిన్న నిర్మాతల మనుగడ కష్టంగా మారిందన్న నిర్మాత చదలవాడ 
  • వారిని ఆదుకునేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చలు జరపాలని వినతి
  • చిరంజీవి నుంచి రాజమౌళి వరకు చిన్న సినిమాల నుంచే వచ్చారని వెల్లడి
తెలుగు చిత్ర పరిశ్రమకు చిన్న నిర్మాతలే వెన్నెముక అని, అయితే ప్రస్తుతం వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న నిర్మాతలను ఆదుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారితో చర్చలు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదు, సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో చదలవాడ మాట్లాడారు. 

పరిశ్రమలో ఎక్కువ సినిమాలు తీసేది చిన్న నిర్మాతలేనని, కానీ వారి పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. చిన్న సినిమాలకు ప్రభుత్వ సపోర్ట్ కన్నా ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మద్దతు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. పెద్ద చెట్టుకు విత్తనం ఎంత ముఖ్యమో, ఇండస్ట్రీకి చిన్న సినిమా కూడా అంతే ముఖ్యమన్నారు. దాన్ని బతికిస్తేనే పరిశ్రమ పచ్చగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఒకప్పుడు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ నుంచి దర్శకులు దాసరి నారాయణరావు, రాజమౌళి వరకు అందరూ చిన్న సినిమాలతోనే తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారని చదలవాడ గుర్తుచేశారు. ప్రస్తుతం సినిమాలు తీయడానికి చాలామంది ఆసక్తితో వస్తున్నా, వాటిని థియేటర్లలో విడుదల చేయడం కష్టంగా మారిందన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో చిన్న సినిమాలకు సబ్సిడీలు ఇచ్చేవారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి ఒక కమిటీ వేసి, చిన్న నిర్మాతలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని చదలవాడ శ్రీనివాసరావు కోరారు.
 
Go Back to Shorts
Chadalavada Srinivasa Rao
Telugu Film Industry
Small Producers
AP CM
Telangana CM
Film Chamber
Producer Council
Movie Subsidies
Chiranjeevi
Junior NTR

More Telugu News