Kanshi Ram: కాన్షీరామ్‌కు 'భారతరత్న' ఇవ్వండి... ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ

Rahul Gandhi Urges Bharat Ratna for Kanshi Ram to PM Modi
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు, బహుజన నేత కాన్షీరామ్‌కు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రధానికి ఓ లేఖ రాశారు. కాన్షీరామ్ జయంతిని పురస్కరించుకుని, ఆయన సేవలను స్మరించుకుంటూ ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు.

భారత రాజకీయాల స్వరూపాన్నే కాన్షీరామ్ మార్చారని రాహుల్ కొనియాడారు. తన ఉద్యమాల ద్వారా బహుజనుల్లో, పేదల్లో రాజకీయ చైతన్యం నింపారని తెలిపారు. వారి ఓటు, గళం, ప్రాతినిధ్యం ఎంతో ముఖ్యమని గుర్తుచేశారని, ఈ దేశం అందరిదీ అని చాటిచెప్పారని వివరించారు. ఆయన కృషి వల్లే ఎందరో అణగారిన వర్గాల ప్రజలు రాజకీయాలను న్యాయం, సమానత్వం సాధించే మార్గంగా చూడటం ప్రారంభించారని పేర్కొన్నారు.

ప్రతి భారతీయుడికి రాజ్యాంగం సమానత్వం, గౌరవం, భాగస్వామ్యం కల్పించిందని, ఆ హామీలను సమాజంలో అట్టడుగున ఉన్నవారికి అందించేందుకు కాన్షీరామ్ తన జీవితాన్ని అంకితం చేశారని రాహుల్ గుర్తుచేశారు. ఇటీవల లక్నోలో జరిగిన 'సామాజిక్ పరివర్తన్ దివస్' కార్యక్రమంలోనూ ఈ డిమాండ్‌కు బలమైన మద్దతు లభించిందని ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ఈ అంశాన్ని లేవనెత్తడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కాన్షీరామ్‌కు భారతరత్న ప్రకటించడం ఆయన దేశానికి చేసిన సేవలకు దక్కే నిజమైన గౌరవమని, ఆయనను సాధికారతకు చిహ్నంగా భావించే కోట్లాది మంది ఆకాంక్షలను నెరవేర్చినట్టు అవుతుందని రాహుల్ తన లేఖను ముగించారు.

అయితే, రాహుల్ డిమాండ్‌పై బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు గుప్పించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి దళిత ఐకాన్‌ల గుర్తింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ గత రికార్డును ఆమె ప్రశ్నించారు.
Kanshi Ram
Rahul Gandhi
Bharat Ratna
Narendra Modi
BSP
Bahujan Samaj Party
Indian Politics
Uttar Pradesh Elections
Mayawati
Social Justice

More Telugu News