Narendra Modi: యుద్ధ ప్రభావం ప్రజలపై పడకుండా మేం చూస్తుంటే, కాంగ్రెస్ భయాందోళనలు సృష్టిస్తోంది: మోదీ తీవ్ర ఆగ్రహం

Narendra Modi criticizes Congress for creating fear about war impact
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం మనపై ఉందని, ఒక విధంగా యుద్ధం లాంటి పరిస్థితి కనిపిస్తోందని, ఇలాంటి తరుణంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో, ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని విమర్శించారు.

అసోంలోని సిల్చార్‌లో ప్రధానమంత్రి పర్యటించారు. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి భారతీయుల్లో ఆందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జాతీయ ప్రయోజనాల విషయంలో ఆ పార్టీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో భయాందోళనలు సృష్టించి తనను వేధించాలని చూస్తున్నారని అన్నారు.

మనదేశ అభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తుల చేతుల్లో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారుతోందని ఆరోపించారు. అసోం ప్రజలు ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో తరిమి కొట్టారని కితాబిచ్చారు. రానున్న ప్రతి ఎన్నికల్లో ప్రతి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతుందని అన్నారు. అసోం పట్ల లేదా దేశం పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కానీ మోదీని ఎలా విమర్శించాలో, అబద్ధాలు చెప్పి ప్రజలను ఎలా తప్పుదారి పట్టించాలో తెలుసని ఎద్దేవా చేశారు.

కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ నాయకులు చొక్కాలు విప్పి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కూడా ప్రధాని స్పందించారు. వారి చర్యను యావత్ దేశం ఖండించిందని అన్నారు. ఓటమితో నిరాశ చెందిన కాంగ్రెస్ పార్టీ దేశం పైనే దాడికి దిగిందని మండిపడ్డారు. నిరాశతో దుస్తులు చించుకోవడం తప్ప వారికి మిగిలిందేమీ లేదని అన్నారు.
Narendra Modi
Assam
Silchar
Congress Party
Iran
Israel
US relations
War impact
Political criticism
Indian economy

More Telugu News