Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై అమెరికా గురి.. ఆచూకీ చెబితే రూ.92 కోట్లు

Mojtaba Khamenei America targets Irans new Supreme Leader offers reward
ఇరాన్‌తో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన అమెరికా, ఇప్పుడు ఆ దేశ అగ్ర నాయకత్వాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారుల ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 92.47 కోట్లు) రివార్డు ఇస్తామని సంచలన ప్రకటన చేసింది.

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ కార్యక్రమం కింద ఈ ప్రకటనను విడుదల చేసింది. మోజ్తబా ఖమేనీతో పాటు రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన కీలక సైనికాధికారులు అలీ అస్ఘర్ హెజాజీ, సెక్యూరిటీ చీఫ్ అలీ లారీజానీ పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చింది. కొందరి ఫోటోలు అందుబాటులో లేకపోవడంతో వారి షాడో చిత్రాలను (Silhouettes) ప్రచురించింది.

ఫిబ్రవరి 28న జరిగిన దాడిలోనే మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించగా, ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఈ దాడిలో ఆయన ముఖం గుర్తుపట్టలేనంతగా మారి ఉండొచ్చని, అందుకే ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బహిరంగంగా కనిపించడం లేదని అమెరికా అనుమానిస్తోంది.

గత మూడు వారాలుగా ఇరాన్‌పై దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇప్పటివరకు 15,000కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల వల్ల ఇరాన్ క్షిపణి సామర్థ్యం 90 శాతం, డ్రోన్ల శక్తి 95 శాతం క్షీణించినట్లు పెంటగాన్ తెలిపింది. "వచ్చే వారం దాడులు మరింత భీకరంగా ఉంటాయి" అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించారు.

మరోవైపు, కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటి, ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్ ప్రజలే తమ నాయకత్వాన్ని కూలదోస్తారని తాము ఆశిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.
Mojtaba Khamenei
Iran
America
US Iran relations
Reward for Justice
Ali Khamenei
Ali Asghar Hejazi
Ali Larijani
Iran supreme leader
Iran war

More Telugu News