Donald Trump: ఇరాన్ ఆర్థిక గుండెకాయపై అమెరికా పంజా.. ట్రంప్ ‘మెగా’ అటాక్!

Donald Trump Announces US Attack on Irans Kharg Island
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా దళాలు చరిత్రలో నిలిచిపోయే స్థాయి బాంబు దాడులు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన స్పందిస్తూ "నా ఆదేశాల మేరకు సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడిని చేపట్టింది. ఇరాన్ మకుటంలో మణి వంటి ఖర్గ్ ఐలాండ్‌లోని ప్రతి సైనిక కేంద్రాన్ని మేము పూర్తిగా తుడిచిపెట్టాం" అని సంచలన ప్రకటన చేశారు.

ఖర్గ్ ఐలాండ్ కేవలం ఒక ద్వీపం కాదు, ఇరాన్ మొత్తం చమురు ఎగుమతుల్లో సుమారు 96 శాతం ఇక్కడి నుంచే జరుగుతాయి. ప్రస్తుతానికి కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని ‘మానవీయ కోణంలో’ చమురు మౌలిక సదుపాయాలను వదిలేశానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’లో ఇరాన్ గనుక అడ్డంకులు సృష్టిస్తే.. ఒక్క క్షణంలో తన నిర్ణయాన్ని మార్చుకుని చమురు క్షేత్రాలను కూడా ధ్వంసం చేస్తానని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా ఆయుధ సంపద ముందు ఇరాన్ రక్షణ వ్యవస్థలు నిలవలేవని, తమ దాడులను అడ్డుకునే శక్తి ఆ దేశానికి లేదని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇరాన్ సైన్యం ఇకనైనా ఆయుధాలు పారేసి, మిగిలి ఉన్న దేశాన్ని కాపాడుకోవడం తెలివైన పని అని సూచించారు. అలాగే, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని నిర్మించలేదని, అమెరికాను లేదా ప్రపంచాన్ని బెదిరించే శక్తిని ఆ దేశానికి లేకుండా చేస్తామని స్పష్టం చేశారు.

ఖర్గ్ ఐలాండ్ దాడి కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, అది ఇరాన్ ఆర్థిక మూలాలను తన గుప్పిట్లోకి తీసుకోవడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాంతంపై పట్టు సాధించడం ద్వారా ఇరాన్ ఆదాయాన్ని పూర్తిగా నిలిపివేసి, చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడమే అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండటంతో, అమెరికా నౌకాదళం త్వరలోనే వాణిజ్య నౌకలకు రక్షణగా రంగంలోకి దిగుతుందని సమాచారం.
Donald Trump
Iran
Kharg Island
US Military
Oil Exports
Hormuz Strait
Iran Nuclear Program
US Foreign Policy
Oil Prices
Middle East

More Telugu News