ఎల్‌నినో ఎంట్రీ.. రాబోయే నెలల్లో మరింత తీవ్రరూపం!
- పసిఫిక్‌లో అధికారికంగా ప్రారంభమైన ఎల్‌నినో
- రుతుపవనాల కాలంలో ప్రభావం మరింత పెరిగే అవకాశం
- ఎల్‌నినో ప్రభావానికి గురయ్యే 197 జిల్లాలను గుర్తించిన కేంద్రం
- రాష్ట్రాలవారీగా ప్రత్యేక అత్యవసర ప్రణాళికలు సిద్ధం
- ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువ ఉండొచ్చని అంచనా
ఐఎండీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం భూమధ్యరేఖా పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి పెరగడంతో ఎల్‌నినో పరిస్థితులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వాతావరణ వ్యవస్థల్లో కూడా ఈ మార్పుల ప్రభావం కనిపించడం ప్రారంభమైందని తెలిపింది. రాబోయే నెలల్లో ఈ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముందని అంచనా వేసింది.
పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కే సహజ వాతావరణ ప్రక్రియే ఎల్‌నినో. భారతదేశంలో ఇది అత్యంత కీలకమైన అంశంగా పరిగణిస్తారు. ఎందుకంటే గతంలో ఎల్‌నినో ప్రభావం ఉన్న సంవత్సరాల్లో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదవడం, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావానికి గురయ్యే అత్యంత సున్నితంగా ఉన్న 197 జిల్లాలను గుర్తించామన్నారు. వాటి కోసం రాష్ట్రాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి వారం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అవసరమైన విత్తనాలు, వ్యవసాయ సామగ్రిని ముందుగానే నిల్వ చేశామని వెల్లడించారు.
రైతుల్లో అవగాహన పెంచేందుకు ‘ఖేత్ బచావో అభియాన్’ పేరుతో దేశవ్యాప్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సగటు వర్షపాతం కంటే సుమారు 90 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఎల్‌నినో ప్రభావం పెరిగితే రుతుపవనాల సీజన్ రెండో భాగంలో వ్యవసాయ రంగానికి మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.