Nara Lokesh: బడి భోజనంలో తేడాలొస్తే కఠిన చర్యలు: మంత్రి నారా లోకేశ్ సీరియస్ వార్నింగ్

Nara Lokesh Warns Strict Action on Midday Meal Issues
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో రుచి, శుచి, నాణ్యత లేదా పోషక విలువలు తగ్గితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా హెచ్చరించారు. అపర అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ పేరుతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంపై కుట్రలు చేసినా, నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన ఫోన్‌లో సమీక్ష నిర్వహించారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారక రామానగర్‌లోని మండల పరిషత్ పాఠశాలలో భోజనం బాగాలేదంటూ ఆ స్కూల్ హెడ్మాస్టర్ జాన్ స్వయంగా విద్యార్థులను తప్పుదోవ పట్టించి, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన ఘటనపై అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన లోకేశ్, ఇలాంటి కుట్రపూరిత ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. మన పిల్లలకు పెట్టే భోజనంపై ఎంత శ్రద్ధ తీసుకుంటామో, ప్రభుత్వ బడుల్లోని పిల్లల విషయంలో అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పథకం అమలులో పారదర్శకత, నాణ్యత పెంచేందుకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భోజనం సిద్ధమయ్యాక, విద్యార్థులకు వడ్డించడానికి ముందుగా ప్రతిరోజూ ఒక టీచర్ తప్పనిసరిగా రుచి చూడాలని, నాణ్యతను నిర్ధారించాలని స్పష్టం చేశారు. పథకంలో సమూల మార్పుల కోసం, రాష్ట్రవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచేందుకు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. వారానికి ఒకరోజు స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఏదో ఒక పాఠశాలను సందర్శించి, పిల్లలతో కలిసి భోజనం చేయాలని కోరారు. దీనివల్ల లోటుపాట్లుంటే వెంటనే సరిదిద్దుకోవడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు.

భోజనం నాణ్యతపై తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను, ఫిర్యాదులను నేరుగా 'లీప్' యాప్ ద్వారా తెలియజేయవచ్చని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కోసం పథకంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Nara Lokesh
Midday Meal Scheme
Andhra Pradesh
School Lunch Quality
Centralized Kitchen
LEAP App
Education Department
Government Schools
Dokka Seethamma
NTR District

More Telugu News