Chandrababu Naidu: వడగాలుల వల్ల ఒక్క మరణం కూడా జరగడానికి వీల్లేదు: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Naidu Directs Collectors No Heatwave Deaths
  • రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సమీక్ష
  • వడదెబ్బ మరణాలు నివారించాలని స్పష్టమైన ఆదేశం
  • వైద్యంలో ఏఐ, టెక్నాలజీ వినియోగాన్ని పెంచాలని సూచన
  • 108 అంబులెన్సులు వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలి
  • ఉపాధి కూలీలు, పశువుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టీకరణ
ఈసారి వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. వడగాలుల కారణంగా రాష్ట్రంలో ఒక్క మరణం కూడా సంభవించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను గట్టిగా ఆదేశించారు. అమరావతిలో రెండో రోజు కొనసాగుతున్న 6వ జిల్లాల కలెక్టర్ల సదస్సులో ఆయన వైద్యారోగ్యం, వేసవి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఎండలో పనిచేసే ఉపాధి హామీ కూలీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల కోసం నిర్మించిన నీటి తొట్టెలను నిరంతరం నీటితో నింపాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలవుతున్న పశు బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలన్నారు.

వైద్యారోగ్య రంగంపైనా సీఎం పలు కీలక సూచనలు చేశారు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో వైద్య పరీక్షలు చేసే వ్యవస్థలను అందుబాటులోకి తేవడాన్ని అభినందించారు. తక్కువ ఖర్చుతో, సులభంగా తరలించగలిగే వైద్య పరికరాలను తయారు చేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాలకు సైతం 108 అంబులెన్సులు వేగంగా చేరుకునేలా రూట్ ఆప్టిమైజేషన్ చేయాలని ఆదేశించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ హబ్ (ఆర్టీఐహెచ్) ద్వారా మరిన్ని ఆవిష్కరణలు చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Heatwave
Summer Action Plan
District Collectors Conference
Public Health
Animal Insurance Scheme
RTGH
108 Ambulance
Artificial Intelligence

More Telugu News