Gurumurthy: పెట్టుబడుల కోసం భూకేటాయింపులు సబబే: వైసీపీ ఎంపీ పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP High Court Supports Land Allocation for Investments
  • తక్కువ ధరకు కంపెనీలకు భూములు కేటాయిస్తున్నారంటూ ఎంపీ గురుమూర్తి పిల్
  • రాయితీలు, భూ కేటాయింపుల్లో ప్రోత్సాహకాలు లేకపోతే కంపెనీలు ఎలా వస్తాయన్న హైకోర్టు
  • మార్కెట్ ధరకు భూములిస్తే కంపెనీలు ఇతర ప్రాంతాలకు వెళతాయని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానంపై రాష్ట్ర హైకోర్టు సానుకూల ధోరణి వ్యక్తం చేసింది. తక్కువ ధరకు భూములను కేటాయిస్తున్నారంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై విచారణ చేపట్టిన ధర్మాసనం, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కీలక వ్యాఖ్యలు చేసింది.


రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయిందని ధర్మాసనం గుర్తుచేసింది. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాలంటే భారీ స్థాయిలో పారిశ్రామికీకరణ జరగడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. కంపెనీలకు రాయితీలు, భూమి కేటాయింపుల్లో ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పెట్టుబడులు ఎలా వస్తాయని కోర్టు ప్రశ్నించింది. మార్కెట్ ధరకే భూములిస్తే, కంపెనీలు తమకు అనుకూలమైన ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.


భూకేటాయింపులను కేవలం ఒక అంశంగా చూడకూడదని, వాటి ద్వారా రానున్న రోజుల్లో వచ్చే ఉపాధి, అభివృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ప్రస్తుత ప్రభుత్వ పాలసీలతో మరో 200 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడింది. ప్రభుత్వ విధానాల వల్ల పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని ఏ కంపెనీ కోర్టుకు రాలేదని, కేవలం ఒక రాజకీయ నేత మాత్రమే ఈ విధానాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వచ్చారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వేలం ద్వారా భూములిస్తే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని కోర్టు అంచనా వేసింది.


హైకోర్టు వ్యాఖ్యలతో పారిశ్రామికవేత్తలకు భూముల కేటాయింపు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు న్యాయపరంగా బలమైన మద్దతు లభించినట్లయింది.
Gurumurthy
Andhra Pradesh
AP High Court
Land Allocation
Industrial Policy
Investments
YS Jagan Mohan Reddy
TDP Government
Economic Development
Job Creation

More Telugu News