IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీతో హైదరాబాద్ ఢీ

IPL 2026 Schedule Released RCB to Clash with SRH in First Match
  • ఐపీఎల్ 2026 తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల
  • ఈ నెల‌ 28న ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ మధ్య సీజన్ తొలి మ్యాచ్
  • రెండో మ్యాచ్‌లో తలపడనున్న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్
  • ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 84 మ్యాచ్‌ల నిర్వహణ
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి మొదలైంది. టాటా ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన తొలి దశ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల‌ 28 నుంచి ఏప్రిల్ 12 వరకు మొత్తం 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దేశంలోని మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతానికి తొలి 16 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసినట్లు బీసీసీఐ తెలిపింది. పోలింగ్ తేదీలు ఖరారైన తర్వాత పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

19వ ఎడిషన్ ఐపీఎల్‌కు ఈ నెల‌ 28న ఘనంగా తెరలేవనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. తొలి దశలో బెంగళూరు, ముంబై, గువాహటి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్‌ సహా మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌లో నాలుగు డబుల్ హెడర్‌లు ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, సాయంత్రం మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

సీజన్‌లోని తొలి డబుల్ హెడర్ ఏప్రిల్ 4న జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. కొన్ని జట్లు తమ తొలి హోమ్ మ్యాచ్‌లను వేరే వేదికల్లో ఆడనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తమ తొలి రెండు హోమ్ మ్యాచ్‌లను గువాహటిలో ఆడనుండగా, పంజాబ్ కింగ్స్ తమ తొలి హోమ్ మ్యాచ్‌లను న్యూ చండీగఢ్‌లోని పీసీఏ స్టేడియంలో ఆడనుంది.

ఇక, ఈ సీజన్ మొత్తం మీద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు హోమ్ మ్యాచ్‌లను బెంగళూరులో, రెండు మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది. పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్‌లకు న్యూ చండీగఢ్, మూడు మ్యాచ్‌లకు ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనుండగా.. రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్‌లను గువాహటిలో, నాలుగు మ్యాచ్‌లను జైపూర్‌లో ఆడనుంది.

బెంగళూరు హోమ్ మ్యాచ్‌లకు నిపుణుల కమిటీ అనుమతి తప్పనిసరి
అయితే, బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నుంచి అనుమతి రావాల్సి ఉందని బీసీసీఐ స్పష్టం చేసింది. మార్చి 13న ఈ కమిటీ చిన్నస్వామి స్టేడియంను తనిఖీ చేసి, మ్యాచ్‌ల నిర్వహణ ఏర్పాట్లపై మాక్ డెమో నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.
IPL 2026 Schedule
Royal Challengers Bangalore
RCB vs SRH
Sunrisers Hyderabad
IPL Schedule
Cricket
T20 League
Mumbai Indians
Chennai Super Kings
Kolkata Knight Riders

More Telugu News