Kalisetti Appalanaidu: జగన్ చిట్టా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది: ఎంపీ అప్పలనాయుడు

Kalisetti Appalanaidu Says Jagans Record is with Central Govt
  • జగన్ హయాంలో రాష్ట్రం దివాలా తీసిందన్న అప్పలనాయుడు
  • వింత పాలసీలతో ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని మండిపాటు
  • జగన్ ప్రభుత్వం మహిళల మాంగల్యాలను తెంపిందని వ్యాఖ్య

కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసిందంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఘాటుగా స్పందించారు. జగన్ హయాంలో రాష్ట్రం దివాలా తీసిందని, ఇప్పుడు ఆయన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. 


"జగన్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. చివరకు మున్సిపల్ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టారు. దేశంలో ఎక్కడా లేని వింత పాలసీలతో ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు" అని కలిశెట్టి ఆరోపించారు. జగన్ చిట్టా మొత్తం కేంద్రం వద్ద ఉందని, ఆయన ఢిల్లీకి లేఖలు రాసినా ప్రయోజనం ఉండదని అన్నారు.


ఐదేళ్ల పాలనలో నకిలీ మద్యం విక్రయాల ద్వారా జగన్ ప్రభుత్వం మహిళల మాంగల్యాలను తెంపిందని కలిశెట్టి విమర్శించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా జగన్ ఇప్పుడు సంస్కరణల గురించి మాట్లాడుతున్నారని, ఆయన ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు కానీ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.


డిప్యూటీ సీఎం చెప్పినట్టు పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా భవిష్యత్తు తరాల సంపద కోసం చంద్రబాబు పాలన అవసరమని, అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని కలిశెట్టి పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలతో జగన్ గుండెల్లో గుబులు మొదలైందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు ఇస్తోందని.. తల్లికి వందనం, ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిపై అనవసర ఆరోపణలు చేయడం జగన్ మానుకోవాలని ఆయన హెచ్చరించారు.

Kalisetti Appalanaidu
Jagan Mohan Reddy
Andhra Pradesh
YS Jagan
Telugu Desam Party
TDP
Chandrababu Naidu
Andhra Pradesh Politics
AP Debts
Fake Liquor Sales

More Telugu News