Dubai: దుబాయ్ లో యుద్ధ భయం.. ఎడారిలో మూగజీవాల ఆక్రందన

Dubai Expats Abandon Pets Amid Middle East Conflict
  • క్షిపణి దాడుల భయంతో దుబాయ్ వీడుతున్న ప్రవాసులు
  • పెంపుడు జంతువులను తీసుకెళ్లలేక స్తంభాలకు కట్టేసి పోతున్న వైనం
  • ఒమన్ సరిహద్దుల్లో పెంపుడు జంతువులకు నో ఎంట్రీ
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు దుబాయ్‌లో విషాదకరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇరాన్ దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న ప్రవాసులు.. తమతో పాటు ఇన్నాళ్లు కలిసి ఉన్న పెంపుడు జంతువులను నడిరోడ్డుపై  వదిలేస్తున్నారు. యజమానులు తమ కుక్కలను స్తంభాలకు కట్టేసి అలాగే వెళ్ళిపోతున్నారు. ఆహారం, నీరు లేక అవి ఆక్రందనలు చేస్తున్నాయి. పిల్లులను అట్టపెట్టెల్లో పెట్టి, వాటిపై ‘‘మమ్మల్ని క్షమించండి.. వీటిని తీసుకెళ్లడం మా వల్ల కాదు’’ అని రాసి రోడ్ల పక్కన పడేస్తున్నారు. కొంతమంది ప్రవాసులు పెంపుడు జంతువులను తరలించే ఖర్చు భరించలేక, వాటికి విషం ఇచ్చి చంపేయాలని పశువైద్యులను కోరుతుండటం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రాణం కంటే ప్రేమ చిన్నదైపోయిందన్నట్లుగా సాగుతున్న ఈ పరిణామాలు జంతు ప్రేమికులను కలచివేస్తున్నాయి.

ఎడారిలో మూగజీవాల హాహాకారాలు

రోడ్డు మార్గంలో ఒమన్ సరిహద్దులకు చేరుకుంటున్న వారు, అక్కడ జంతువులకు అనుమతి లేకపోవడంతో వాటిని ఎడారిలోనే వదిలి వెళుతున్నారు. భగభగమండే ఎండలో ఆహారం లేక అవి అలమటిస్తున్నాయి. అటు జంతు సంరక్షణ కేంద్రాలు కూడా ఇప్పటికే నిండిపోవడంతో కొత్తగా వచ్చే జంతువులను చేర్చుకోవడం వారికి భారంగా మారింది. రోజుకు వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

సరిపోని స్మార్ట్ మెషీన్ల సాయం..

దుబాయ్ మున్సిపాలిటీ వీధి జంతువుల కోసం ఏర్పాటు చేసిన ‘ఎహ్సాన్ స్టేషన్’ (ఆహారం అందించే స్మార్ట్ మెషీన్లు) ఇప్పుడు పెరుగుతున్న ఈ సంఖ్యకు సరిపోవడం లేదు. సంపన్న దేశంలో ఇలాంటి అమానవీయ ఘటనలు జరగడం పట్ల అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Dubai
Dubai expats
Middle East tensions
Abandoned pets
Animal rescue
Oman border
Ehsan Station
Pet relocation costs
Desert animals

More Telugu News