Sivaji: జగన్ గారూ... నా జోలికి రావొద్దు: శివాజీ
- తన సినిమాలు రిలీజ్ కాకముందే నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారని శివాజీ మండిపాటు
- పేటీఎం బ్యాచ్ అంటూ ట్రోలర్లపై విరుచుకుపడ్డ శివాజీ
- తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని వ్యాఖ్య
నటుడు శివాజీ తాజాగా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతూ, రాజకీయ, సినీ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలు విడుదల కాకముందే కొందరు పనిగట్టుకుని నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారని, 'పేటీఎం బ్యాచ్' అంటూ సోషల్ మీడియా ట్రోలర్లపై ఆయన విరుచుకుపడ్డారు. వంద మంది సబ్‌స్క్రైబర్లు కూడా లేని వారు తన గురించి మాట్లాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవడం పెద్ద విషయం కాదని హెచ్చరించారు. 'అరేయ్ పేటీఎం బ్యాచ్... నన్ను తగులుకుంటే అది మీకే ప్రమాదకరం' అని హెచ్చరించారు.
రాజకీయాల ప్రస్తావన తెస్తూ వైసీపీ అధినేతను ఉద్దేశించి శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. "జగన్ గారు... నా జోలికి రావద్దు, నాకు రాజకీయాలు వద్దు" అని పేర్కొంటూనే, అమరావతి రైతుల కోసం ఏ పార్టీ మీదనైనా పోరాడతానని చెప్పారు. అవసరమైతే ప్రధాని మోదీని కూడా అడుగుతానని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ వంటి వాటిపై ప్రజలకు నమ్మకం కలగాలంటే, ముందుగా కేసులు ఉన్న రాజకీయ నాయకులపై విచారణ వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని, గతంలో అధికారంలో ఉన్నవారే తనను ఏమీ చేయలేకపోయారని శివాజీ గుర్తు చేశారు. తన పని తాను చేసుకుంటుంటే అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని, నిజాయతీగా బతుకుతున్న తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోనని ఆయన ఘాటుగా హెచ్చరించారు.