కొత్త హంగులతో తెలంగాణ శాసన మండలి భవనం ప్రారంభం
- తెలంగాణ శాసన మండలి నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- అసెంబ్లీ ప్రాంగణంలోని పాత అసెంబ్లీ బిల్డింగ్‌లో ఇకపై మండలి సమావేశాలు
- రూ.30 కోట్లతో పాత భవనాన్ని ఆధునీకరించిన ప్రభుత్వం
- ఈసారి బడ్జెట్ సమావేశాలు ఈ కొత్త భవనంలోనే నిర్వహణ
- ఒకే ప్రాంగణంలో ఉభయ సభలు ఉండేలా రేవంత్ సర్కార్ నిర్ణయం
నిజాం కాలం నాటి ఇండో-సార్సెనిక్ వాస్తుశైలిలో నిర్మితమైన ఈ భవనంలో గతంలో హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ, ఆ తర్వాత ఉమ్మడి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగేవి. 2014 రాష్ట్ర విభజన తర్వాత దీనిని ఏపీ అసెంబ్లీకి కేటాయించారు. అయితే ఏపీ అసెంబ్లీ అమరావతికి తరలివెళ్లడంతో ఈ భవనం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అసెంబ్లీ మరియు కౌన్సిల్ రెండూ ఒకే ప్రాంగణంలో ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఈ హెరిటేజ్ భవనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు.
ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ (ఏకేటీసీ) సహకారంతో రూ.30 కోట్లతో 18 నెలల పాటు ఈ పనులు సాగాయి. ఇందులో అధునాతన డ్రైనేజీ, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఫ్లోరింగ్ పనులు చేపట్టారు. సీఎం, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ కోసం ప్రత్యేక ఛాంబర్లు, మీడియా హాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ భవనం పార్లమెంట్ తరహాలో ఎంతో అద్భుతంగా ఉందని, సభ్యులకు అన్ని సౌకర్యాలు కల్పించామని మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
2018 నుంచి ఇప్పటివరకు జూబ్లీహాల్‌లో మండలి సమావేశాలు జరుగుతుండగా, ఇకపై ఆ హాల్‌ను ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు వినియోగించనున్నారు. అలాగే ఉభయ సభల సంయుక్త సమావేశాల కోసం కొత్త సెంట్రల్ హాల్ నిర్మించే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది.
