Donald Trump: మీ అవసరం లేదు... గుర్తు పెట్టుకుంటాను: బ్రిటన్ ప్రధానిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం

Donald Trump Angered by UKs Hesitation on Iran War Support
  • వాహక నౌకను పంపించే విషయంపై తేల్చుకోని బ్రిటన్
  • యుద్ధం గెలిచాక కలిసే వ్యక్తులు అవసరం లేదన్న ట్రంప్
  • యూకే ఒకప్పుడు తమకు మిత్రదేశమని వ్యాఖ్య
ఇరాన్‌తో యుద్ధం వేళ, బ్రిటన్ ప్రధానమంత్రి తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాకు విమాన వాహక నౌకలను పంపించే విషయంపై యూకే ప్రభుత్వం ఇంకా తేల్చుకోకపోవడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. యుద్ధం గెలిచిన తర్వాత తమతో కలిసే వ్యక్తులు అవసరం లేదని వ్యాఖ్యానించారు.

యుద్ధంలో గెలిచాక మీ విమాన వాహక నౌకలను మోహరించాల్సిన అవసరం లేదని యూకే ప్రధాని కీర్ స్మార్టర్‌పై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా స్మార్టర్‌పై విమర్శలు గుప్పించారు.

బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ 'హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్' విమాన వాహన నౌకను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. రెండు విమాన వాహక నౌకలలో ఒకదానిని సిద్ధంగా ఉంచామని, అయితే పశ్చిమాసియాకు తరలించే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని బ్రిటన్‌కు చెందిన ఒక అధికారి మీడియాతో మాట్లాడుతు తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. ఒకప్పుడు యూకే తమకు మిత్రదేశమని పేర్కొన్నారు. పశ్చిమాసియాకు రెండు విమాన వాహక నౌకలను తరలించే విషయంపై వారు తీవ్రంగా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. అమెరికా బలగాలకు ఇప్పుడు వాటి అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ చర్యను తాము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామని స్మార్టర్‌కు హెచ్చరిక జారీ చేశారు.

ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా చేస్తున్న యుద్ధంలో తమ బలగాలు ప్రత్యక్షంగా పాల్గొనబోవని బ్రిటన్ ప్రధాని స్పష్టం చేశారు. అయితే తమ సైనిక స్థావరాలను ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు అనుమతిస్తున్నట్లు స్మార్టర్ వెల్లడించారు. స్మార్టర్ ఈ చర్యతో తాను సంతృప్తిగా లేనని ట్రంప్ అన్నారు.
Donald Trump
Iran
UK
Britain
Keir Starmer
US Military
Middle East
HMS Prince of Wales

More Telugu News