Iran: అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు ఆ దేశాల నౌకలపై కూడా దాడులు చేస్తాం: ఇరాన్ హెచ్చరిక

Iran Threatens Attacks on US Israel Allied Ships
  • హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇదివరకే ప్రకటించిన ఇరాన్
  • అమెరికా, ఇజ్రాయెల్, మిత్రదేశాల నౌకలు వస్తే లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టీకరణ
  • యుద్ధ సమయంలో హోర్ముజ్‌ను నియంత్రించే హక్కు తమకు ఉందని వెల్లడి
అమెరికా, ఇజ్రాయెల్, యూరప్‌తో పాటు వాటికి మద్దతు పలికే దేశాల నౌకలపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్, అమెరికా తమ దేశంపై దాడులు చేస్తున్న నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. దీనితో ఈ జలసంధికి ఇరువైపుల వేలాది నౌకలు నిలిచిపోయాయి. శ్రీలంక సమీపంలో ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి చేయడంతో అమెరికా ట్యాంకర్‌ లక్ష్యంగా ఇరాన్ దాడికి పాల్పడింది.

తాజాగా, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఇజ్రాయెల్, అమెరికాతో పాటు వారికి మద్దతు పలికే దేశాలను కూడా హెచ్చరించింది. ఆ దేశాలకు చెందిన నౌకలను హోర్ముజ్ జలసంధి మీదుగా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. హెచ్చరికలను బేఖాతరు చేస్తే ఆ నౌకలు లక్ష్యంగా దాడులు చేస్తామని తెలిపింది. అంతర్జాతీయ చట్టం, సంబంధిత తీర్మానాలకు అనుగుణంగా యుద్ధ సమయంలో హోర్ముజ్‌ను నియంత్రించే హక్కు తమకు ఉందని తెలిపింది.

ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్, యూరప్‌తో పాటు వాటికి మద్దతిచ్చే దేశాల నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ తెలిపింది. చైనా జెండాలు ఉన్న నౌకలను అనుమతిస్తామని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాల నుంచి భారత్, చైనా వంటి దేశాలకు హోర్ముజ్ జలసంధి మీదుగా చమురుతో పాటు పలు ఉత్పత్తులు రవాణా అవుతాయి.
Iran
Iran Israel conflict
Israel
Hormuz Strait
US Iran tensions
Islamic Revolutionary Guard Corps

More Telugu News