జగన్ హయాంలో నిజాలను తొక్కిపెట్టే ప్రయత్నం జరిగింది: ఆనం రామనారాయణరెడ్డి
- ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ అంశంపై చర్చ సందర్భంగా గందరగోళం
- చైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు
- సభను రేపటికి వాయిదా వేసిన మండలి చైర్మన్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై ఈరోజు జరిగిన చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సున్నితమైన అంశంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరఫున ప్రకటన చేసేందుకు సిద్ధమవగా, ప్రతిపక్ష వైసీపీ సభ్యులు తీవ్రస్థాయిలో అడ్డు తగిలారు.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే విషయం దర్యాప్తు సంస్థల నివేదికల్లో స్పష్టంగా ఉందని, అప్పటి ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కి తమకు అనుకూలమైన వారికి టెండర్లు కట్టబెట్టిందని మంత్రి ఆనం ఆరోపించారు. జగన్ హయాంలో నిజాలను తొక్కిపెట్టే ప్రయత్నం జరిగిందని, నాటి టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కూడా కొన్ని విషయాలను అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.
మంత్రి మాట్లాడుతున్న సమయంలోనే వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం పెరగడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మండలి చైర్మన్ మోషేను రాజు సభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, చివరకు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.