Andhra Pradesh Legislative Council: రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

Andhra Pradesh Legislative Council Approves Key Bills
  • అసైన్డ్ భూముల బిల్లు.. గ్రామ, వార్డు సచివాలయాల బిల్లులకు ఆమోదం
  • అసైన్డ్ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజుకు ఇచ్చే అవకాశం
  • గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రెండు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ బిల్లులను మండలి ఆమోదించింది.


అసైన్డ్ భూముల సవరణ బిల్లు - 2026

మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో వివరించిన ప్రకారం, ఈ సవరణ ద్వారా ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు (సౌర, పవన విద్యుత్ వంటివి) లీజుకు ఇచ్చే అవకాశం లభిస్తుంది. బంజరు లేదా చౌడు భూములుగా ఉండి సాగుకు పనికిరాని అసైన్డ్ భూములకు ఈ లీజు ద్వారా భరోసా లభిస్తుంది. ఎకరాకు ఏడాదికి రూ. 31 వేల లీజు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి రెండేళ్లకు లీజు మొత్తాన్ని 5 శాతం మేర పెంచుతూ చట్టంలో సవరణ చేశారు.


అసైనీదారుల పూర్తి అనుమతితోనే భూములు తీసుకుంటారు. ట్రై-పార్టీ అగ్రిమెంట్ (త్రిపక్ష ఒప్పందం) ద్వారా లబ్ధిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తారు. ఈ చట్టంతో రాష్ట్రంలో సుమారు రూ. 10 లక్షల కోట్ల విలువైన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల 7.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.


గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లు -2026

గ్రామ వార్డు స్థాయి పాలనలో మార్పులు తీసుకువస్తూ ఈ బిల్లును ఆమోదించారు. ప్రస్తుతం ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై 'స్వర్ణ గ్రామం' మరియు 'స్వర్ణ వార్డు' సచివాలయాలుగా పిలుస్తారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

Andhra Pradesh Legislative Council
Assigned Lands Act
AP Grama Ward Sachivalayam
Clean Energy Projects
Anagani Satya Prasad
Swarna Gramam
Swarna Wardu Sachivalayam
Andhra Pradesh
AP Assembly

More Telugu News