బహ్రెయిన్‌లో చిక్కుకున్న 150 మంది తెలుగువారు.. ఆదుకోవాలని విజ్ఞప్తి

  • ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా విమానాల రద్దు
  • హైదరాబాద్ నుంచి వెళ్లిన వారిలో కాంగ్రెస్ నేత సాల్మన్ రాజు
  • తమను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి
  • హెల్ప్‌లైన్ నంబర్లు పనిచేయడం లేదని ఆవేదన
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బహ్రెయిన్‌లో సుమారు 150 మంది తెలుగువారు చిక్కుకుపోయారు. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో విమాన సర్వీసులు రద్దు కావడమే ఇందుకు కారణం. బాధితుల్లో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు సభ్యుల బృందం కూడా ఉంది. తమను స్వదేశానికి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన ఏడుగురు సభ్యుల బృందం గడిచిన ఫిబ్రవరి 24న బహ్రెయిన్ రాజధాని మనామాకు వెళ్లింది. వీరిలో కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకుడు గోనె సాల్మన్ రాజు కూడా ఉన్నారు. వీరంతా ఫిబ్రవరి 28న తిరిగి భారత్‌కు రావాల్సి ఉండగా, ఎయిర్‌పోర్టులో ఉన్న సమయంలోనే విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

దీంతో తమతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 150 మంది వరకు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకున్నట్లు సాల్మన్ రాజు తెలిపారు. వారంతా ప్రస్తుతం ఎయిర్‌పోర్టుకు సమీపంలోని తెలుగు ప్రవాసీయుల ఇళ్లల్లో ఆశ్రయం పొందుతున్నట్లు పేర్కొన్నారు. తమను సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించడం లేదని సాల్మన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News