ఏటీఎం రూల్స్ మార్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్... వివరాలు ఇవిగో!

  • ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న హెచ్‌డీఎఫ్‌సీ కొత్త నిబంధనలు
  • ఉచిత  ఏటీఎం లావాదేవీల పరిమితిలోకి యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్స్
  • నగరాల్లో 3, ఇతర ప్రాంతాల్లో 5 సార్లు ఉచిత లావాదేవీలకు ఛాన్స్
  • పరిమితి దాటితే ఇకపై సాధారణ ఛార్జీలు వర్తింపు
భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ తమ ఖాతాదారులకు కీలక సమాచారం అందించింది. ఏప్రిల్ 1 నుంచి  ఏటీఎం నగదు ఉపసంహరణ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణలను కూడా నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిలో లెక్కించనున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది.

బ్యాంక్ జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు డెబిట్ కార్డు అవసరం లేకుండా యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. దీన్ని ఇకపై ప్రత్యేక కేటగిరీగా చూడరని, సాధారణ డెబిట్ కార్డు విత్‌డ్రాయల్స్‌తో కలిపే లెక్కించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. అంటే కస్టమర్లు కార్డు ఉపయోగించి డబ్బు తీసినా, లేదా యూపీఐ ద్వారా తీసినా అవి నెలవారీ ఉచిత కోటా కిందకే వస్తాయి. ఒకవేళ నిర్ణీత పరిమితి దాటితే, సాధారణ ఏటీఎం ఛార్జీలు వర్తిస్తాయి.

ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవింగ్స్, శాలరీ ఖాతాదారులకు తమ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలను అనుమతిస్తోంది. అలాగే ఇతర బ్యాంక్ ఏటీఎంలలో మెట్రో నగరాల్లో (టాప్-6 సిటీస్) 3 సార్లు, ఇతర ప్రాంతాల్లో 5 సార్లు ఉచితంగా డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఇకపై యూపీఐ లావాదేవీలు కూడా ఈ లిమిట్ లోపే ఉండాలి. బ్యాంకింగ్ ఛానళ్లలో ఫీజుల విధానాన్ని ప్రామాణీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ పేర్కొంది.

ఇక ఆర్థిక ఫలితాల విషయానికొస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభం 12.17 శాతం పెరిగింది. నికర వడ్డీ ఆదాయం కూడా 6.4 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 32,615 కోట్లకు చేరింది. నిన్న సోమవారం నాడు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు రూ. 881.75 వద్ద స్థిరపడింది. హోలీ పండుగ సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో ట్రేడింగ్ జరగలేదు.




More Telugu News