నేపాల్ ఎన్నికల ఎఫెక్ట్.. భారత్ సరిహద్దు 72 గంటల పాటు మూసివేత

  • నేపాల్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత్ సరిహద్దు మూసివేత
  • నిన్న‌ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు 
  • భద్రతా కారణాల దృష్ట్యా రాకపోకలను నిలిపివేస్తున్నట్టు ప్రకటన
  • నిత్యావసర సేవలు, విదేశీయులకు మినహాయింపు
నేపాల్‌లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా భద్రతా చర్యలలో భాగంగా భారత్-నేపాల్ సరిహద్దును 72 గంటల పాటు మూసివేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయని, గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని నేపాల్ అధికారులు వెల్లడించారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ శక్తులు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారత్ లేదా నేపాల్‌లో ఎన్నికలు జరిగినప్పుడు సరిహద్దు పాయింట్లను మూసివేయడం ఇరు దేశాల మధ్య ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కూడా ‘ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ప్లాన్ 2025’లో భాగంగా సరిహద్దును మూసివేయాలని నిర్ణయించినట్టు నేపాల్ సాయుధ పోలీసు దళం (ఏపీఎఫ్) అధికార ప్రతినిధి, డీఐజీ విష్ణు ప్రసాద్ భట్ట తెలిపారు. నిత్యావసర వస్తువుల రవాణా, సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న విదేశీయులకు మాత్రం మినహాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

నేపాల్ పార్లమెంటులోని 275 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ‘జెన్ జ‌డ్‌’ ఉద్యమం కారణంగా కూలిపోయింది. అనంతరం ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో సుశీల కార్కీ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.

ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో విదేశీ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలపై కూడా నిషేధం విధించారు. అనుమానిత వ్యక్తులు, గ్రూపులు దేశంలోకి చొరబడకుండా నిరోధించేందుకు భారత సశస్త్ర సీమా బల్ (SSB)తో కలిసి సమన్వయం చేసుకుంటున్నామని డీఐజీ విష్ణు ప్రసాద్ భట్ట వివరించారు. ‘జెన్ జ‌డ్‌’ ఉద్యమ సమయంలో లూటీకి గురైన ఆయుధాలు ఇంకా లభ్యం కాకపోవడంతో మరింత అప్రమత్తంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.


More Telugu News