Iran: ప్రపంచానికి ఇరాన్ చమురు సెగ.. హార్ముజ్ జలసంధి మూసివేత!

Iran Shuts Down Hormuz Strait Threatens Global Oil Supply
  • హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్ సంచలన ప్రకటన
  • అటుగా వచ్చే నౌకలను తగలబెడతామని తీవ్ర హెచ్చరికలు జారీ
  • అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య అని వెల్లడి
  • ఇరాన్ ప్రకటన అవాస్తవమన్న అమెరికా.. కానీ నిలిచిపోయిన నౌకల రవాణా
  • ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే కీలక పరిణామం
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలముకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయలాంటి హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించే ఏ నౌకనైనా తగలబెడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్-ఇన్-చీఫ్‌కు సీనియర్ సలహాదారు అయిన బ్రిగేడియర్ జనరల్ సర్దార్ ఇబ్రహీం జబారీ ఈ ప్రకటన చేశారు. "హోర్ముజ్ జలసంధి మూసివేయబడింది. ఎవరైనా దాటడానికి ప్రయత్నిస్తే, మా సైనికులు ఆ నౌకలను తగలబెడతారు" అని ఆయన ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వర్గాలు ఖండించాయి. జలసంధి తెరిచే ఉందని పేర్కొన్నాయి.

రెండు దేశాల నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇరాన్ బెదిరింపులు, ఇటీవల వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల నేపథ్యంలో అనేక అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు తమ సర్వీసులను నిలిపివేశాయి. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థలు కూడా యుద్ధ నష్ట బీమా కవరేజీని రద్దు చేయడంతో వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో 150కి పైగా నౌకలు జలసంధికి వెలుపల నిలిచిపోయినట్టు సమాచారం.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" పేరుతో సైనిక చర్య ప్రారంభించాయి. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దీనికి ప్రతీకారంగానే హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్టు తెలుస్తోంది. ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
Iran
Iran oil
Hormuz Strait
oil prices
Middle East tensions
US CENTCOM
Operation Epic Fury
Brigadier General Sardar Ibrahim Jabari
shipping companies
oil transport

More Telugu News